పాట్నా: పశు దాణా కుంభకోణానికి సంబంధించిన కేసులో రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జెడి) నాయకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు శనివారం జామీను మంజూరు చేసింది. బీహార్‌లో ఒకప్పుడు భాగమైన జార్ఖండ్‌లోని ట్రెజరీ నుంచి పశు దాణా కోసం అక్రమంగా రూ.3.13 కోట్లు తీసుకున్నారన్న ఆరోపణకు సంబంధించిన దుంకా ట్రెజరీ కేసులో ఇప్పటికే కారాగార శిక్షను అనుభవిస్తున్న లాలూ ప్రసాద్‌కు బెయిల్ మంజూరు కావడంతో ఆయన తన స్వగృహానికి వెళ్లడానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్ పశు దాణా కుంభకోణానికి సంబంధించి నమోడైన నాలుగు కేసులలో మూడింటిలో బెయిల్ మంజూరైంది. కాగా..బెయిల్ కాలంలో లాలూ దేశం విడిచిపోరాదని, తన చిరునామాను కాని, ఫోన్ నంబర్‌ను కాని మార్చకూడదని హైకోర్టు న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ ఆదేశించారు. 1991-96 మధ్య లాలూ ప్రసాద్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బీహార్ పశు సంవర్ధక శాఖ అధికారులు దుంకా ట్రెజరీ నుంచి అక్రమంగా నిధులను విడుదల చేశారని లాలూపై అభియోగాలు నమోదయ్యాయి.
Lalu Prasad Yadav gets bail in fodder scam