చకూలియ(ప.బెంగాల్): ముందుగా నిర్ణయించిన ప్రకారం ఎనిమిది దశలలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలన్న తన నిర్ణయాన్ని పునఃపరిశీలించవలసిందిగా చేతులెత్తి వేడుకుంటున్నానని టిఎంసి అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఎన్నికల కమిషన్‌ను అర్థించారు. కొవిడ్-19 వ్యాప్తిని కొద్ది వరకైనా కట్టడి చేసేందుకు మిగిలిన మూడు దశల ఎన్నికలను ఒకటి లేదా రెండు రోజులలో పూర్తి చేయాలని ఆమె ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఉత్తర్ దినాజ్‌పూర్‌లో ఒక ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ బిజెపి ప్రోద్బలంతోనే మిగిలిన మూడు దశల ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ వ్యతిరేకిస్తోందని ఆమె ఆరోపించారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ఇసిని కోరారు. రద్దీ ప్రాంతాలలో తాను కాని, తన పార్టీ నాయకులు కాని ఎన్నికల ర్యాలీలు నిర్వహించబోమని మమత ప్రకటించారు వ్యాక్సిన్ సంక్షోభాన్ని నివారించడానికి గత ఆరు నెలలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆమె ఆరోపించారు. బిజెపిని విధ్వంసకారులు, యుద్ధోన్మాదులతో కూడిన పార్టీగా ఆమె అభివర్ణించారు. బెంగాల్‌ను గుజరాత్‌గా మార్చడానికి బిజెపికి అవకాశం ఇవ్వరాదని బెంగాలీ ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. కూచ్ బిహార్‌లో జరిగిన కాల్పుల సంఘటనను ప్రస్తావిస్తూ ఓటర్లపై కాల్పులు జరిపి ప్రజలను చంపేందుకు వారు(బిజెపి) కుట్రపన్నారని, వారి బుల్లెట్‌కు మీ ఓటే సమాధానం కావాలని ఆమె కోరారు.
Mamata Urges EC to hold remaining phases