న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో జాతికి ధైర్యం చెప్పేందుకు ప్రధానమంత్రి మోదీ మంగళవారం రాత్రి జాతినుద్దేశించి మాట్లాడారు. కరోనాను కట్టడి చేయడానికి కొన్నాళ్లుగా కఠినమైన పోరాటం చేస్తున్నాం.. రెండో దశలో కరోనా మరింత తీవ్రమైన సవాల్ విసురుతున్నది.. రెండో దశలో తుపాన్ వలే విరుచుకు పడుతున్నది. కరోనాను నియంత్రించడానికి అహర్నిశలు కృషి చేస్తున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన ఔషధ సంస్థలు భారత్‌లో ఉన్నాయి. కరోనా రెండో దశలో ఔషధాల కొరత లేదు. ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు వేస్తున్న దేశంగా మనదేశం నిలిచింది.. ఫార్మా కంపెనీలు ఔషధాల ఉత్పత్తిని పెంచాయి.. ఫ్రంట్ లైన్ వారియర్స్, సీనియర్ సిటిజన్లకు టీకాల ప్రక్రియ పూర్తి చేశాంమన్నారు.
మే ఒకటో తేదీ తర్వాత కూడా 45 ఏండ్లు దాటిన వారికి టీకాల ప్రక్రియ కొనసాగుతుంది. 18 ఏండ్లు దాటిన వారికి టీకాలు వేస్తే దేశంలోని వివిధ నగరాల్లో సత్ఫలితాలు వస్తాయి. యువకులు టీమ్‌లుగా ఏర్పడి ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. దేశంలో ఆక్సిజన్ డిమాండ్ బాగా పెరిగింది. డిమాండ్‌కు తగినట్లుగా ఆక్సిజన్ ఉత్పత్తి పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం.. కొత్త వ్యాక్సిన్లకు ఫాస్ట్ ట్రాక్ పద్దతిలో అనుమతులు ఇచ్చాం అని స్పష్టం చేశారు. 12 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తయింది. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా చర్యలు తీసుకున్నాం.అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావొద్దు. లాక్ డౌన్ విధించే పరిస్థితి తీసుకు రావొద్దని, లాక్‌డౌన్ నుంచి దేశాన్ని కాపాడాలి అని దేశ ప్రజలను ప్రధాని మోదీ కోరారు.