Saturday, November 16, 2024

హైదరాబాద్‌కు చావోరేవో

- Advertisement -
- Advertisement -

IPL:today Match between SRH vs PBKS

నేడు పంజాబ్‌తో కీలక పోరు

చెన్నై: వరుస ఓటములతో డీలా పడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగే పోరు సవాలుగా మారింది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి శుభారంభం చేయాలని హైదరాబాద్ భావిస్తోంది. మరోవైపు పంజాబ్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకంగా తయారైంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన రాహుల్ సేన కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో ఈసారిఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. ఇక ఈ సీజన్‌లో ఒక్క విజయం కూడా సాధించని హైదరాబాద్‌కు ఈ మ్యాచ్ చావోరేవోగా తయారైంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే సన్‌రైజర్స్ ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి స్థితిలో ఈ మ్యాచ్‌లో విజయం సాధించడమే లక్షంగా డేవిడ్ వార్నర్ సేన బరిలోకి దిగుతోంది. జట్టులో ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. స్వల్ప లక్ష్యాలను సయితం ఛేదించలేక చతికిల పడుతోంది. బెంగళూరు, ముంబైలతో జరిగిన మ్యాచ్‌లో గెలిచే స్థితిలో ఉండి కూడా ఓటమి పాలైంది.

ఇలాంటి స్థితిలో జట్టు ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై నెలకొంది. ఈ మ్యాచ్‌లో అతను జట్టుకు చాలా కీలంగా మారాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వార్నర్ విజృంభిస్తే హైదరాబాద్‌కు ఎదురే ఉండదు. అయితే వార్నర్ చివరి వరకు క్రీజులో ఉండడంలో విఫలమవుతున్నాడు. దీని ప్రభావం జట్టుపై స్పష్టంగా కనిపిస్తోంది. మరో కీలక ఆటగాడు బెయిర్‌స్టో కూడా తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కిందటి మ్యాచ్‌లో బెయిర్‌స్టో బాగానే ఆడినా మిగతావారు విఫలం కావడంతో ఫలితం లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో వార్నర్‌తో కలిసి బెయిర్‌స్టో మరోసారి శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది. మరోవైపు జట్టు భారీ ఆశలు పెట్టుకున్న మనీష్‌పాండే, విజయ్ శంకర్‌లు పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నారు. ఇద్దరికి ఇప్పటికే పలు అవకాశాలు లభించినా ఫలితం లేకుండా పోతోంది. రానున్న మ్యాచుల్లోనైనా వీరిద్దరు తమ పాత్రను సమర్థంగా పోషించాల్సిన అవసరం జట్టుకు ఉంది. యువ ఆటగాళ్లు సమద్, అభిషేక్ తదితరులు కూడా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు.

బ్యాటింగే అసలు సమస్య..

మరోవైపు హైదరాబాద్‌కు బ్యాటింగే అసలు సమస్యగా మారింది. బౌలింగ్‌లో బాగానే రాణిస్తున్నా బ్యాటింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఇప్పటి వరకు ఓడిన మూడు మ్యాచుల్లోనూ బ్యాటింగ్ వైఫల్యమే కారణంగా చెప్పొచ్చు. వార్నర్, బెయిర్‌స్టో, మనీష్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. ఇకనైనా బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం జట్టుపై ఉంది. అప్పుడే గెలుపు అవకాశాలుంటాయి.

గెలుపే లక్ష్యంగా కింగ్స్..

ఇక పంజాబ్ ఈ మ్యాచ్‌లో భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై భారీ స్కోరును సాధించినా ఓటమి తప్పలేదు. ఈసారి మాత్రం ఎలాగైన గెలవాలనే పట్టుదలతో ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. కెప్టెన్ కెఎల్.రాహుల్, మయాంక్ అగర్వాల్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, యువ సంచలనం షారుక్ ఖాన్ తదితరులతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అయితే బౌలింగ్‌లో నిలకడ లోపించడం జట్టును కలవరానికి గురిచేస్తోంది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ను మెరుగు పరుచుకుంటే పంజాబ్‌కు విజయం కష్టమేమీ కాదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News