న్యూఢిల్లీ: ఓఎన్‌జిసికి చెందిన ముగ్గురు ఉద్యోగులను సాయుధ తీవ్రవాదులు బుధవారం తెల్లవారుజామున అస్సాంలో అపహరించారు. అస్సాంలోని శివసాగర్ జిల్లాలోని లక్వా చమురు క్షేత్రంపై దాడి చేసిన ఐదుగురు సాయుధ తీవ్రవాదులు అక్కడి ఇద్దరు సెక్యూరిటీ గార్డులను గదిలో బంధించి, ముగ్గురు ఉద్యోగులను కిడ్నాప్ చేసి ఓఎన్‌జిసికి చెందిన అత్యవసర వైద్య వాహనంతో పరారయ్యారు. నిషిద్ధ యుల్ఫా(ఐ) గ్రూపునకు చెందిన తీవ్రవాదులని అనుమానిస్తున్న వీరు తాము అపహరించిన వాహనాన్ని అస్సాం-నాగాల్యాండ్ సరిహద్దులోని నిమోనాగఢ్ అడవుల సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు.
ఈ సంఘటనపై కంపెనీ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు అస్సాంలోని చమురు క్షేత్రాల వద్ద భద్రతను పటిష్టం చేశారు. ఈసంఘటనలో తీవ్రవాదులు కాల్పులు ఏవీ జరపలేదని అధికారులు చెప్పారు. అపహరణకు గురైన ముగ్గురు ఓఎన్‌జిసి ఉద్యోగులలో ఇద్దరు జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్టు, ఒక జూనియర్ టెక్నీషియన్‌గా కంపెనీ ప్రకటించింది. స్థానిక అస్సామీలైన ఈ ముగ్గురు ఉద్యోగులు ఇటీవలే ఉద్యోగంలో చేరారని కంపెనీ తెలిపింది. వీరి ఆచూకీ ఇప్పటి వరకు తెలియరాలేదని, తీవ్రవాదుల నుంచి ఎటువంటి సమాచారం తమకు కాని బాధితుల కుటుంబాలకు కాని రాలేదని కంపెనీ ట్వీట్ చేసింది. శివసాగర్ జిల్లాలోని లక్వా చమురు క్షేత్రంలో దాదాపు 2,000 మంది ఉద్యోగులు, అధికారులు, ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు.