72 గంటల్లో 10 లక్షల కొత్త కేసులు.. 7 వేల మరణాలు
రోజురోజుకు పెరిగిపోతున్న కేసుల సంఖ్య
నాలుగో రోజూ 3 లక్షలకు పైగా కొత్త కేసులు, 2 వేలకు పైగా మరణాలు
న్యూఢిలీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తొలి దశతో పోలిస్తే సెకండ్ వేవ్‌లో అత్యంత వేగంగా విరుచుకుపడుతోంది. భారత్‌లో గత ఏడాది తొలి 10 లక్షల కేసులు నమోదు కావడానికి దాదాపు 150 రోజులు పడితే .. రెండో దశలో కేవలం మూడు రోజుల్లోనే దాదాపు 10 లక్షల కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. గడచిన 72 గంటల్లో దేశంలో 10లక్షల కొత్త కేసులు నమోదు కాగా, దాదాపు 7 వేల మరణాలు సంభవించడం భయాందోళనలకు గురి చేస్తోంది. మూడు రోజులక్రితం ఈ నెల 21న దేశంలో తొలి సారి 3 లక్షల కేసులు వెలుగు చూశాయి. ఆ తర్వాత వరసగా 3 లక్షలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. శనివారం నాలుగో రోజు కూడా 3,46,786 కొత్త కేసులు వెలుగు చూశాయి. అలాగే మరణాలసంఖ్య కూడా 2,624గా ఉంది. కొత్త కేసులు సంఖ్య భారీగా పెరుగుతుండడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 25 లక్షలను దాటడం గమనార్హం.
74 శాతం కేసులు 10 రాష్ట్రాల్లో
రెండో దశలో కరోనా మహారాష్ట్రలో విజృంభించింది. అయితే ఆ తర్వాత చాపకింద నీరులాగా అన్ని రాష్ట్రాలకు విస్తరించింది.ప్రస్తుతం కొత్తగా నమోదైన కేసుల్లో 74.15 శాతం పది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్ర సహా ఢిల్లీ, యుపి, కర్నాటక, కేరళ,చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 12 రాష్ట్రాల్లో కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 773 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోగా, ఢిల్లీలో 348 మంది, చత్తీస్‌గఢ్‌లో 219 మంది, యుపిలో 196 మంది, గుజరాత్‌లో 142 మంది, కర్నాటకలో 190 మంది, తమిళనాడులో 78మంది, పంజాబ్‌లో 75 మంది మృతి చెందారు.
ఊరటనిస్తున్న రికవరీలు
అయితే రోజువారి కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతన్నప్పటికీ రికవరీలు కూడా దాదాపు అదే స్థాయిలో ఉండడం కాస్త ఊరటనిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2.19 లక్షల మంది వైరస్‌నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1.38 కోట్లు దాటింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13.83 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
India reports 10 lakh corona cases within 72 hours