అతికొద్దిమంది మహిళల్లో రక్తం గడ్డ కట్టిన సంఘటనలు
వాషింగ్టన్: జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌కు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థలు ఆమోదం తెలిపాయి. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను అమెరికాలో వినియోగంలోకి తేగా, కొద్దిమంది మహిళల్లో రక్తం గడ్డ కట్టినట్టు గుర్తించారు. దాంతో, వ్యాక్సిన్ వినియోగాన్ని 11 రోజులపాటు నిలిపివేశారు. శుక్రవారం ఎఫ్‌డిఎతోపాటు సిడిసి ఈ వ్యాక్సిన్ వాడకానికి అనుమతిచ్చాయి. 80 లక్షలమందికి జె అండ్ జె వ్యాక్సిన్ ఇవ్వగా, 15మంది మహిళల్లో రక్తం గడ్డ కట్టింది. వారంతా 50 ఏళ్లలోపువారు కావడం గమనార్హం. వారిలో ముగ్గురు చనిపోగా, ఏడుగురిని ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మహిళల్లో ఎదురైన ఈ దుష్పరిణామంతో వ్యాక్సిన్ వాడకం అంశాన్ని సిడిసి సలహా కమిటీ పరిశీలించింది.
సలహా కమిటీ ఓటింగ్‌లో 104 మెజార్టీతో వ్యాక్సిన్ వాడకానికే మొగ్గు చూపారు. కొద్దిమంది మహిళల్లో రక్తం గడ్డ కట్టడాన్ని స్వల్ప సమస్యగానే కమిటీ తేల్చింది. సమస్యాత్మక మహిళలకు వేరే వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా సూచించింది. సింగిల్ డోస్‌తో మంచి ఫలితాలిస్తున్నందున వినియోగించడమే సరైందని కమిటీ నిర్ణయించింది. ఇటీవల యూరోపియన్ యూనియన్ ఔషధ నియంత్రణ సంస్థ కూడా ఇదే తరహా నిర్ణయాన్ని వెల్లడించింది. దాంతో, జె అండ్ జె వ్యాక్సిన్‌కు పాశ్చాత్య దేశాల్లో లైన్ క్లియరైంది.