హైదరాబాద్: దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతుంది. లక్షలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌తో సినీ పరిశ్రమ మరోసారి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే చాలా మంది సినీ తారలు కరోనా బారిన పడ్డారు. ఈ రోజు టాలీవుడ్ దర్శకుడు, రచయిత ఎన్. సాయి బాలాజీ ప్రసాద్ కోవిడ్ -19 తో మరణించారు. కొన్ని రోజులుగా కరోనా చికిత్స పొందుతున్న సాయి బాలాజీ ప్రసాద్ సోమవారం ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని టిమ్స్ వద్ద చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 57 సంవత్సరాలు. సాయి బాలాజీ ప్రసాద్ రియల్ స్టార్ శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరే తమ్ముడు’, ‘సిరి’, ‘అపరంజీ’, ‘హలహలం’ సీరియళ్లకు దర్శకత్వం వహించారు. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు గారు నిర్మించిన ‘బావగారు బాగున్నారా’ చిత్రానికి స్క్రీన్ రైటర్లలో సాయి బాలాజీ ప్రసాద్ ఒకరు. సాయి బాలాజీ ప్రసాద్ స్వస్థలం తిరుపతి. రవిరాజా పినిశెట్టి డైరెక్టింగ్ విభాగంలో పనిచేసి.. దర్శకుడిగా ఎదిగారు. సాయి బాలాజీ ప్రసాద్‌కు భార్య గౌరీ, కుమార్తె స్నేహ పూజిత ఉన్నారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ, టీవీ నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.