అహ్మదాబాద్: వరుస ఓటములతో సతమతమవుతున్న కోల్ కతా నైట్‌రైడర్స్‌కు ఓదార్పు విజయం లభించింది. సోమవారం అహ్మదాబాద్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో కోల్‌కతాకు ఇది రెండో గెలుపు. ముందుగా బ్యాటిం గ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన కోల్‌కతా 16.4 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ నితీష్ రాణా (0) తొలి ఓవర్‌లోనే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ రెండు ఫోర్లతో 9 పరుగులు చేసి ఔటయ్యాడు. ఒక సునీల్ నరైన్ ఖాతా తెరవకుండనే వెనుదిరిగాడు. దీంతో కోల్‌కతా 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఆదుకున్న మోర్గాన్, త్రిపాఠి
ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తనపై వేసుకున్నాడు. అతనికి రాహుల్ త్రిపాఠి అండగా నిలిచాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన త్రిపాఠి ఏడు ఫోర్లతో వేగంగా 41 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మోర్గా న్ 4 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో కోల్‌కతా ఘన విజయం సాధించింది.
ఆరంభం నుంచే తడబాటు..
టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ కింగ్స్‌ను కట్టడి చేయడంలో కోల్‌కతా బౌలర్లు సఫలమయ్యారు. శివమ్ మావి, కమిన్స్, నరైన్ తదితరులు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో పంజాబ్ వేగంగా పరుగులు చేయలేక పోయింది. దూకుడైన బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే ఓపెనర్లు కెఎల్.రాహుల్, మయాంక్ అగర్వాల్ తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమయ్యారు. ఆడినంత సేపు తడబాటు స్పష్టంగా కనిపించింది. ఇక ఒత్తిడిని జయించేందుకు భారీ షాట్లే మార్గమని భావించిన కెప్టె న్ రాహుల్ ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 19 పరుగులు చేసి అతన్ని కమి న్స్ వెనక్కి పంపాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ నిరాశ పరిచాడు. శివమ్ మావి బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌటయ్యాడు.. తర్వాత వచ్చిన దీపక్ హూడా కూడా విఫలమయ్యాడు. ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే మయాంక్ అగర్వాల్ కూడా వెనుదిరిగాడు. రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 31 పరుగుల చేసిన మయాంక్‌ను నరైన్ పెవిలియన్ దారి చూపించాడు. దీంతో పంజాబ్ మళ్లీ కోలుకోలేక పోయింది. నికోలస్ పూరన్ 19 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో క్రిస్ జోర్డాన్ కాస్త పోరాటం చేశాడు. కోల్‌కతా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న జోర్డాన్ మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 30 పరుగులు చేయడంతో పంజాబ్ స్కోరు 123 పరుగులకు చేరింది. ఇక ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు, కమిన్స్, సునీల్ నరైన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
IPL 2021: KKR won by 5 wickets against PBKS