Monday, November 18, 2024

మాజీ మంత్రి ఎంఎస్ఆర్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు(87) కన్నుమూశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామును 245 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం డాక్టర్లు వెంటిలేటర్‌పైనే చికిత్స అందించారు. అదే క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఎమ్మెస్సార్ పూర్తి పేరు మేనేని సత్యనారాయణరావు. 1934 జనవరి 14న జన్మించారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బి పూర్తి చేశారు. 1954 నుంచి 69 వరకు విద్యార్థి, యువజన నాయకుడిగా పనిచేశారు. 1969 ప్రత్యేక తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. 1971లో తెలంగాణ ప్రజా సమితి తరపున కరీంనగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం మరో రెండు పర్యాయాలు కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. 14 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేశారు. పీడీ చట్టం కింద కేసులు నమోదై జైలుకెళ్లారు. వరంగల్, చంచల్‌గూడ జైళ్లలో ఉన్నారు. పలు శాఖలకు మంత్రిగా.. 1980 నుంచి 1983 వరకు అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1985 నుంచి 1988 వరకు సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్‌గా పనిచేశారు. 1990 నుంచి 94 వరకు ఎపిఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గానూ విధులు నిర్వర్తించారు. 2000 సంవత్సరం నుంచి 2007 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ, క్రీడ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పనిచేశారు. దేవాదాయ భూముల అమ్మకం ఆరోపణలతో మంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధపడ్డారు. 2006లో కెసిఆర్‌తో సవాల్ చేసి కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నికకు కారణమయ్యారు. భారీ మెజార్టీతో కెసిఆర్ విజయం సాధించడంతో ఎమ్మెస్సార్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2007 నుంచి 14 వరకు ఎపిఎస్‌ఆర్టీసి చైర్మన్‌గా పనిచేశారు. 37 దేశాలను సందర్శించిన సత్యనారాయణరావుకు ఇందిరాగాంధీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఉప్పునూతన పురుషోత్తం రెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిలతో కలిసి ‘చివరకు మిగిలేది’ సినిమాను నిర్మించారు. విలక్షణ నేతగా ఎమ్మెస్సార్ పేరు తెచ్చుకున్నారు. విషయాలను నిర్మొహమాటంగా, బాహాటంగా చెప్పే శైలి ఎం.సత్యనారాయణరావుకే సొంతం. మలిదశ ఉద్యమంలోనూ తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. గవర్నర్ కావాలన్న తన కోరికను పలుమార్లు వ్యక్తం చేశారు.
ఎమ్మెస్సార్ మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ వాదిగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి, ఎంపి, ఆర్టీసీ చైర్మన్‌గా ఆయన ప్రత్యేక శైలి కనబర్చారు. రాజకీయాల్లో ముక్కుసూటి మనిషిగా పేరొందారని సిఎం కెసిఆర్ గుర్తు చేసుకున్నారు. దివగంత ఎమ్మెస్సార్ కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎమ్మెస్సార్ మరణం పట్ల శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎమ్మెస్సార్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకంక్షించారు. పార్టీలో క్రమశిక్షణ కలిగిన గొప్ప నాయకుడని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. ఆయన మరణం కాంగ్రెస్‌కు తీరని లోటన్నారు. ఎమ్మెస్సార్ మృతి పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఎమ్మెస్సార్ భౌతిక కాయాన్ని సందర్శించిన మంత్రి ఈటల
నిమ్స్‌లో మాజీ మంత్రి ఎం.సత్యనారాయణ రావు భౌతికకాయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు. తరువాత మంత్రి మాట్లాడుతూ సత్యనారాయణ రావు 60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. కరీంనగర్ ప్రజల హృదయాల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుని పరమపదించడం చాలా బాధాకరం. తెలంగాణ రాష్టం ఒక మంచి నీతివంతమైన రాజకీయ నాయకుడ్ని, గొప్ప అనుభవం ఉన్న నాయకుని కోల్పోయింది అని భావిస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన స్థానంలో ఉండి కూడా జిల్లా ప్రజలను మరవనటువంటి వ్యక్తి సత్యనారాయణరావు అని అన్నారు.
ఎమ్మెస్సార్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య దిగ్భాంతి
కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్.సత్యనారాయణ రావు మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘విలక్షణ ప్రజా నాయకుడు ఎంఎస్‌ఆర్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. మూడు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా, ఎంఎల్‌ఎగా, రాష్ట్ర మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్‌గా, సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రజలు, కార్మికుల సంక్షేమ కోసం వారు విశేష కృషి చేశారు. రాజకీయాల్లో చెప్పిన మాటకు కట్టుబడి ఉండే అతి తక్కువమంది నేతల్లో ఎం.సత్యనారాయణరావు పేరు చిరస్థాయిగా నిలుస్తుంది. రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకున్న అనంతరం కూడా ప్రజా సంక్షేమాన్ని విస్మరించని మంచి మనిషి ఎంఎస్‌ఆర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాన’ని వెంకయ్య నాయుడు తెలిపారు.
ఎమ్మెస్సార్ మరణం బాధాకరం ః పవన్
కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు మరణం బాధాకరమని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన ఆయన ముక్కుసూటిగా మాట్లాడేవారని అన్నారు. ఆర్టీసీ చైర్మన్‌గా ఆ సంస్థ అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. సత్యనారాయణరావు కుటుంబానికి తన తరపున, జనసేన పక్షాన పవన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మంచి అనుభవజ్ఞుడైన నేతను తెలంగాణ కోల్పోయింది ః డిఎస్
మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మృతి పట్ల రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ సంతాపం తెలిపారు. ఎమ్మెస్సార్ తమకు మార్గదర్శకంగా ఉండేవారని అన్నారు. ఎమ్మెస్సార్ లేని లోటు తీరనిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మంచి అనుభవజ్ఞుడైన నేతను తెలంగాణ కోల్పోయిందన్నారు. ఎమ్మెస్సార్ కుటుంబసభ్యులకు డిఎస్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఎమ్మెస్సార్ మృతి తీరని లోటు ః షబ్బీర్ అలీ
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజకీయ దురంధరుడు ఎం.సత్యనారాయణరావు మరణం కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణకు తీరని లోటు అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. 1971లో ఎమ్మెస్సార్ కరీంనగర్ నుంచి తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో తను సామాన్య కార్యకర్త అని తర్వాత ఆయన పిసిసి అధ్యక్షులుగా ఉన్న సమయంలో తను ఉపాధ్యక్షులుగా పనిచేశానని అన్నారు. తనకు మంత్రి పదవి వచ్చినప్పుడు ఎమ్మెస్సార్ ఆర్టీసి చైర్మన్‌గా ఉన్నారని కామారెడ్డికి ఎన్నో బస్సులు వేయించారని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఎమ్మెస్సార్ మరణం బాధాకరం ః డా.జె.గీతారెడ్డి
మాజీ పిసిసి అధ్యక్షులు ఎం.సత్యనారాయణరావు మరణం చాలా బాధాకరమని సౌత్ జోన్ ఎఐపిసి రీజనల్ కోఆర్డినేటర్ జె.గీతారెడ్డి అన్నారు. ఎమ్మెస్సార్ పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు తాను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశానన్నారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. ఎమ్మెస్సార్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అధికార లాంఛనాలతో ఎమ్మెస్సార్ అంత్యక్రియలు పూర్తి
కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ మహా ప్రస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News