జెనీవా : భారత్‌లో మార్పు చెందిన కరోనా బి.1.617 రకం లేదా డబుల్ మ్యూటెంట్ ఇప్పటివరకు కనీసం 17 దేశాల్లో కనుగొనడమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మొదటి సారి భారత్‌లో బయటపడిన ఈ రకం బ్రిటన్, సింగపూర్ తదితర దేశాల్లోనూ బయటపడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన వారాంతపు సమీక్షలో వివరించింది. ఏప్రిల్ 27న 17 దేశాల నుంచి బి.1.617 రకం జన్యుక్రమాలు దాదాపు 1200 వరకు జర్మనీ లోని వైరస్ పరిశోధన సంస్ధ జిఐఎస్‌ఐఎడి చేరగా, వీటిలో ఎక్కువ భాగం భారత్ నుంచి వచ్చినవేనని ప్రకటించింది. అయితే ఇది ప్రాణాంతకం అని ఇప్పటికిప్పుడే చెప్పలేమని పేర్కొంది.
భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరగడానికి ఈ రకం వైరస్ ప్రధాన పాత్ర వహించినట్టు తెలుస్తోందని అంచనా వేసింది. దీంతోపాటు వైరస్ వ్యాప్తికి నిబంధనల పట్ల ప్రజల్లో నిర్లక్షం, జనం రద్దీగా ఉండడం తదితర ఇతర కారణాలు కూడా ఉన్నాయని పేర్కొంది. ఈ కొత్తరకం బి1.617 ప్రాణాంతకం అని చెప్పడానికి ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. దీనివల్లనే వైరస్ తీవ్రత పెరుగుతున్నట్టు సరైన ఆధారాలు లేవని నేషనల్ సెంటర్ ఫర్ బయొలాజికల్ సైన్సెస్‌కు చెందిన హెచ్ సౌమిత్ర దాస్ చెప్పారు. భారత్ లోని కొవాగ్జిన్, కొవిషీల్డు వ్యాక్సిన్లు ఈ రకం వైరస్‌పై సమర్ధంగా పనిచేస్తున్నాయని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ వెల్లడించింది.