హైదరాబాద్: మహారాష్ట్ర, కర్నాటక, ఎపి, ఛత్తీస్‌గడ్ నుంచి రాష్ట్రానికి పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారని, అందువల్లే తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా 19 డయాగ్నోస్టిక్ సెంటర్లలో వివిధ పరీక్షలు నిర్వహించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారన్నారు. 19 జిల్లాలలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి తెచ్చామని, వచ్చే నెల కేసులు పెరిగే అవకాశం ఉన్నందున, ఆక్సిజన్ 600 మెట్రికల్ టన్నుల పెంచాలని కేంద్రాన్ని కోరామన్నారు. తెలంగాణలో నెలకొన్న విపత్కర్ పరిస్థితుల పట్ల కేంద్రమే బాధ్యతాయుతంగా వహించాలని ఈటెల స్పష్టం చేశారు.
తెలంగాణలో 18 ఏళ్లకు పైబడిన వారు 1.7 కోట్ల మంది ఉన్నారని, వీళ్లకు రెండు డోసుల చొప్పున మూడు కోట్ల డోసులు అవసరమని తెలియజేశారు. వ్యాక్సిన్ విషయంలో కేంద్రం పునరాలోచించాలని, రెమిడెసివిర్ ఇంజక్షన్‌పై కేంద్రం ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచిందని, మూడు వేల రూపాయల ఇంజక్షన్‌ను 30 వేల రూపాయలకు అమ్ముతున్నారని మండిపడ్డారు.
దీనికి కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలని నిలదీశారు. వ్యాక్సిన్, ఇంజక్షన్ల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. రెమిడెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా విజృంభనను కేంద్రం అంచనా వేయడంలో విఫలమైందని, అందుకే దేశవ్యాప్తంగా ఎన్నికలు, కుంభమేళాలు నిర్వహిస్తున్నారని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్లు, ఇంజక్షన్ల సరఫరాలో కేంద్రానికి ముందుచూపులేదని, టెస్టులు, వ్యాక్సిన్ ఒకే దగ్గర కాకుండా ప్రత్యామ్నాయ ఆలోచిస్తున్నామన్నారు.
తెలంగాణపై కొంత మంది కేంద్రం పెద్దలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం కరోనా విషయంలో తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. వ్యాక్సిన్లు, ఇంజక్షన్లు అన్ని కేంద్రం చేతిలోనే పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరం నుంచి కరోనాతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నామని, కేంద్రం ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం పాటిస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించిన అనేక అంశాలపై కేంద్రం స్పందించిందన్నారు.