Friday, November 22, 2024

కేంద్రం ‘తప్పు’టడుగు

- Advertisement -
- Advertisement -

రెండోదశ అంచనాలో ఘోర వైఫల్యం

 వ్యాక్సిన్లు, ఇంజక్షన్లు, ఆక్సిజన్ పంపిణీలో ఇబ్బందులకు గురిచేస్తోంది
 ప్రాణవాయువు అందక ప్రజలు చనిపోవడం దేశానికే అవమానకరం
 వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రాలపై కేంద్రం పెద్దల విమర్శలు
 విపత్కర పరిస్థితుల్లో టీకాలు ఉచితంగా ఇవ్వాలి : ఈటల

మన తెలంగాణ/ హైదరాబాద్: కరోనా నియంత్రణలో కేంద్రం బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. సెకండ్ వేవ్ తీవ్రతను అంచనా వేయడంలోనూ కేంద్రం విఫలమైందన్నారు. ప్రపంచలోని అన్ని దేశాలు ఒక యూనిట్‌లా పనిచేస్తుంటే, భారతదేశం మాత్రం మరోక మార్గంలో వెళ్తుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యాక్సిన్లు, ఇంజక్షన్, ఆక్సిజన్ ల విషయంలో రాష్ట్రాల చేతులు కట్టేసి కేంద్రం పెత్తనం చెలయిస్తూ ఇబ్బంది పెడుతుందన్నారు. అంతేగాక కొందరు బిజెపి నాయకులు రాష్ట్రాలపై విమర్శలు కురిపిస్తున్నారని, అసలు కేంద్రం అజమాయిషీ చేస్తుంటే రాష్ట్రాలు ఏం చేశాయని? ఆయన ప్రశ్నించారు. గత సంవత్సర కాలంగా కరోనా భయానక వాతావరణంలోకి నెట్టిందన్నారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో పాటు పలుమార్లు ప్రధానమంత్రి సిఎంలతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన సలహాలు ,సూచనలను తు చ తప్పకుండా పాటిస్తున్నామన్నారు. ఎక్కడ కూడా రాజకీయాలు ప్రస్తావించకుండా ప్రజలను కాపాడటమే ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు. కానీ ఈ మధ్య కాలంలో కేంద్రంలో ఉన్న పలువురు పెద్ద నాయకులు మాట్లాడుతున్న తీరు బాధ్యతారాహిత్యం గా ఉందన్నారు. వారు ఏదో ఇస్తుంటే రాష్ట్రాలు వాడుకోవడం లేదని, పట్టించుకోవడం లేదంటూ మాట్లాడుతున్నారన్నారు. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్రాలను విమర్శించడం కరెక్టేనా? అని మంత్రి ధ్వజమెత్తారు. మాట్లాడే ముందు ప్రతి అంశంపై అవగాహన చేసుకోవాలని ఆయన బిజెపి నాయకులకు హెచ్చరించారు. మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత, ప్రమాదాలు వలన పేషెంట్లు చనిపోతున్నట్లు వార్తలు రావడం వాస్తవం కాదా ? అని మంత్రి అడిగారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి ప్రజలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పేషెంట్లకూ చికిత్స అందిస్తున్న విషయం కేంద్రానికి తెలియదా? అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో చికిత్స తీసుకుంటున్న ప్రతి పేషెంట్‌కు ఇబ్బందులు కలగకుండా 24 గంటలు మానిటర్ చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం సిఎం కెసిఆర్ నాయకత్వంలో కష్టపడి పనిచేస్తుంటే, తప్పుడు విమర్శలు చేస్తూ ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని మంత్రి గుర్తుచేశారు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిపై ఆయన కొవిడ్ నిపుణలతో కలసి గురువారం బిఆర్‌కే భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…కరోనా సోకిన వారిలో 90 నుంచి 95 శాతం మంది ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారన్నారు. ఇలాంటి వారు పరీక్షలు చేసుకోకపోవడం వల్ల కొంతమంది ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నట్లు గుర్తించామన్నారు. దీనిని అధిగమించేందుకు రాష్ట్రంలో 19 డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి ద్వారా రక్తంలో ఇన్ఫెక్షన్ రేట్ పెరిగిందా? తగ్గిందా? తెలుసుకోవడం వల్ల మరణాల రేటు తగ్గించవచ్చని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆక్సిజన్‌పై ఆధారపడే వారి సంఖ్య పెరుగుతోంది..
రాష్ట్రంలో పాజిటివ్ కేసులతో పాటు ఆక్సిజన్ మీద ఆధార పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని మంత్రి ఈటల చెప్పారు. ప్రస్తుతం 360 మెటిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉండగా, రాబోయే రోజుల్లో అది ఆరు వందల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామన్నారు. ఈ మేరకు రాష్ట్రానికి ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరినట్లు మంత్రి తెలిపారు. కేంద్రం వద్ద ఉన్న రైల్వేస్, మిలటరీల ద్వారా ఆక్సిజన్‌ను అన్ని రాష్ట్రాలకు సమానంగా అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయేలా వ్యవహరించవద్దని ఆయన సూచించారు. నియంత్రణ మాత్రమే కాకుండా అవసరాల మేరకు సరఫరా చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదేనని మంత్రి చెప్పుకొచ్చారు.
ప్రకటన చేశారు కానీ వ్యాక్సిన్లు ఇవ్వడం లేదు…
18 సంవత్సరాల పై బడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ప్రకటన చేసింది కానీ ఆ స్థాయిలో డోసులు ఇవ్వకపోవడం బాధాకరమని మంత్రి ఈటల అన్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఒక కోటి 75 లక్షల మందికి వాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, రెండు డోసులు కలిపి మూడున్నర కోట్ల డోసుల వాక్సిన్ రాష్ట్రానికి అవసరమవుతాయన్నారు. వీటిలో ప్రస్తుతం ఎంత ఇస్తారు? ఎలా ఇస్తారు? అనే విధివిధానాలను ఇప్పటి వరకు కేంద్రం ప్రకటించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ సమకూర్చుకున్న తర్వాత మాత్రమే 18 సంవత్సరాల వయసు పైబడిన వారికి ఇవ్వనున్నట్లు మంత్రి తేల్చిచెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అందరికీ ఉచితంగా ఇవ్వాల్సిన కేంద్రం ఆంక్షలు పెట్టడం విచిత్రంగా ఉందన్నారు.
ధరలను నియంత్రించాల్సిన బాధ్యత కేంద్రానిదే..
ఇంజక్షన్లు ,వ్యాక్సిన్లు ఎంత ధరకు తయారవుతాయో తెలుసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద విషయం కాదని కానీ తయారీ ఖర్చుకి సరఫరా చేస్తున్న రేటు కి పొంతన లేకుండా ఉందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలను నియంత్రించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన చెప్పారు. ఆక్సిజన్, రెమ్‌డెసివిర్, మెడిసిన్ పక్కదారి పట్టకుండా, బ్లాక్ మార్కెట్ కాకుండా ఉక్కు పదం పెట్టాలని ఆయన అధికారులకు సూచించారు. ఇలాంటి పనులు చేయొద్దని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తులు చేశామని, తమ దృష్టికి వచ్చిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాం..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పలు ఆసుపత్రులలో వ్యాక్సినేషన్, టెస్టింగ్ ఒకే దగ్గర జరుగుతున్న నేపథ్యంలో వైరస్ మామూలు వారికి వ్యాప్తి చెందకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి ఈటల అన్నారు. సీనియర్ సిటీజన్స్, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే కాకుండా కమ్యూనిటీ సెంటర్ లను కూడా వాడుకోవాలని అధికారులకు సూచించామన్నారు. అయితే ప్రస్తుతానికి కేసులు స్థిరంగా ఉన్నాయని, కానీ లాక్‌డౌన్ పెట్టే ఆలోచన మాత్రం ఇప్పుడు లేదని మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లనర్ డా. కరుణాకర్ రెడ్డి, కరోనా జాతీయ నిపుణుల కమిటీ సభ్యులు డా. గంగాధర్‌లు పాల్గొన్నారు.

Etela Rajender press meet on Corona situation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News