Tuesday, November 5, 2024

నా వ్యక్తిత్వాన్ని చంపే కుట్ర: మంత్రి ఈటల

- Advertisement -
- Advertisement -

నా వ్యక్తిత్వాన్ని చంపే కుట్ర
అసైన్డ్ భూములు నా స్వాధీనంలో లేవు
నా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం కంటే పదవి ముఖ్యం కాదు
సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కోరుతున్నా: మంత్రి ఈటల వివరణ

మన తెలంగాణ/హైదరాబాద్: తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వివరణ ఇచ్చారు. ముందస్తు ప్రణాళికతో దుప్ప్రచారం చేశారని, తనపై కట్టుకథలు అల్లారని ఆరోపించారు. ఒక ఎకరం కూడా తన స్వాధీనంలో లేదన్నారు. జమునా హ్యాచరీస్ పేరుతో తాను కోళ్ల వ్యాపారం చేస్తున్నానని.. పౌల్ట్రీకి భూమి ఎక్కువగా కావాలి గనుక..అచ్చంపేట, హకీంపేట మారుమూల గ్రామాల్లో 2016లో ఎకరా 6 లక్షల చొప్పున 40 ఎకరాలు ఒకేసారి కొన్నామని ఈటల రాజేందర్ అన్నారు. కెనరా బ్యాంకు ద్వారా రూ.100 కోట్లు రుణం తీసుకున్నామని వెల్లడించారు. విస్తరణ కోసం పరిశ్రమల శాఖకు లేఖ రాశానని తెలిపారు. విషయాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లానని ఈటల స్పష్టం చేశారు. భూమిని రైతులే స్వచ్ఛందంగా సరెండర్ చేశారని, అది వ్యవసాయ భూమి కాదని ఈటల అన్నారు. తాను రాజకీయంగా ఎదగడానికి ముందే 2004లో తనకు 124 ఎకరాల భూములున్నాయని మంత్రి ఈటల వెల్లడి చేశారు. తొండలు కూడా గుడ్లు పెట్టని భూములను కొని వ్యాపారాలు చేస్తున్నానని.. తాను కొన్నవి వ్యవసాయ భూములు కాదని, ఎవరి భూములు కూడా కబ్జా చేయలేదని మంత్రి ఈటల వివరించారు.

పథకం ప్రకారం భూకబ్జాదారుడని ఒకేసారి కొన్ని టీవీల్లో తనపై ప్రచారం జరగడం దుర్మార్గమని మంత్రి ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు జనానికి తెలియాలనే తాను మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని, అంతిమ విజయం ధర్మానిదేనని మంత్రి ఈటల పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై చేస్తున్న ఆరోపణలు చూసి భరించలేకనే మాట్లాడాల్సి వస్తోందని.. తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. తనపై విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన చూశానని.. ఒక ఎసిబితోనే కాదు.. సిట్టింగ్ జడ్జితోనూ విచారణ జరిపించండి. తనపై తప్పులు ధైర్యం ఉంటే రుజువు చేయండని మంత్రి ఈటల సవాల్ విసిరారు. 20 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉంటూ ఆరుసార్లు ఎంఎల్‌ఎగా గెలుపొందడం జరిగిందని, ఎవరి దగ్గరైనా పది రూపాయలు డబ్బులు తీసుకున్న పాపాన పోలేదని, తన నియోజకవర్గంలోనే కాదు.. తనతో పనులు చేయించుకున్న వారెవరి దగ్గరైనా విచారించుకోవచ్చని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. తనకు ప్రస్తుతం ఉన్న పదవి గడ్డిపోచతో సమానమని తాను చెప్పలేనన్నారు. అయితే తన ఆత్మగౌరవం, ఆత్మాభిమానం కంటే తనకు పదవి ముఖ్యం కాదని మంత్రి ఈటల తెలిపారు. తాను భయపడే వ్యక్తిని కాదని మంత్రి ఈటల చెప్పుకొచ్చారు. తనపై వస్తున్న కబ్జా ఆరోపణలు తన వ్యక్తిత్వాన్ని చంపే కుట్రగా మంత్రి ఈటల అభివర్ణించారు.

Etela Rajender Press Meet over Land scam allegations

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News