Saturday, November 23, 2024

తెలంగాణ ఆశాజ్యోతి కె.టి.ఆర్.

- Advertisement -
- Advertisement -

KTR An effective Young Leader

 

కె.టి.ఆర్. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి పగ్గాలు చేపడుతాడని సోషియల్ మీడియాలో, పత్రికల్లో, కొందరి మాటల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్త పుకారు కావచ్చు, వదంతులు కావచ్చు, నిజమయి ఉండవచ్చు. రాజకీయాలకు సంబంధించిన వార్తల్లో అర్ధసత్యాలు, వదంతులెక్కువగాను సత్యాలు తక్కువగాను ఉంటా యి. కె.టి.ఆర్. తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతాడే అనుకుందాం.. అయితే తప్పేంటి..? దాని గురించి రాజకీయులు వంశపారంపర్య పాలన అని విరుచుకుపడటం, ఏదో మునిగి పోతున్నట్టు విమర్శలు చేయడం అవసరమా..? కె.సి.ఆర్. ముఖ్యమంత్రిగా ఉండటమా? కె.టి.ఆర్. ఉండటమా? ఇంకేమైనా చేయడమా అన్నది గెలిచిన పార్టీ టి.ఆర్.ఎస్. అంతర్గత వ్యవహారం, గెలిచిన సభ్యుల అభిప్రాయాల సేకరణతోనే, మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే పార్టీ అధినేత నిర్ణయిస్తారు.

అశేష ప్రజా మద్దతును కూడగట్టి, పదమూడు సంవత్సరాలు మడమతిప్పని పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడు కె.సి.ఆర్. ఒంటి చేత్తో రెండుసార్లు పార్టీకి ఘన విజయం అందజేసి ముఖ్యమంత్రి అయిన నాయకుడు. తెలంగాణ అంతరంగాన్ని ఎరిగిన కె.సి.ఆర్. కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నవాడు. అలాంటి కె.సి.ఆర్. కాళేశ్వరం, యాదాద్రి లాంటి అద్భుతాలను సాధించడమే కాక, తెలంగాణను దక్షిణ భారత ధాన్యాగారంగా మార్చారు. దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాడు.

కె.సి.ఆర్. అంటేనే తెలంగాణ అంతరాత్మ, ఆత్మగౌరవం. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలుగకుండా ఉండాలంటే, సర్వతో ముఖాభివృద్ది జరుగాలంటే ఎవరెక్కడుండాలో కె.సి.ఆర్. కు తెల్సినంతగా మరెవరికీ తెలియదు. అందుకే నేమో మార్పులు చేర్పులు అనే వార్త రావడం. ఆ వార్తను పట్టుకొని వంశ పారంపర్య, వారసత్వ అధికార మార్పు చర్యగా గొంతు చించుకోవడంలో ఔచిత్యమేముంది? తాను రాజకీయ యుద్ధం చేసి గెలిచి ఎవరికో ఎందుకు అధికారం అప్పగిస్తారు ఏ రాజైనా ఈ పని చేసాడా..? బాబరు నుండి హుమాయూన్, హుమాయూన్ నుండి అక్బర్, అక్బర్ నుండి జహంగీర్, జహంగీర్ నుండి షాజహాన్, షాజహాన్ నుండి ఔరంగజేబు వారసత్వ పరంపరగా.

రాజులైన వారే కదా! మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్తుడి నుండి పరంపరగా బిందుసారుడు, అశోకుడు .. బృహద్రధుడు రాజులయ్యారు కదా! జార్జి చక్రవర్తులు, విక్టోరియా వంశజులు, నెపోలియన్లంతా వంశపారంపర్య పాలన చేసిన వారే కదా! ఇదంతా రాజుల కాలమనుకుందాం. ప్రజాస్వామ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పరోక్షంగా సోనియా గాంధీ దాదాపు 56 సంవత్సరాలు దేశన్నేలింది వంశ పారంపర్యంగా అన్నట్టేకదా! బిజూ పట్నాయక్ నవీన్ పట్నాయక్‌ను, ములాయం సింగ్ యాదవ్ అఖిలేశ్ యాదవ్‌ను, లాలూ ప్రసాద్ తేజస్వి యాదవ్ ను, చంద్రబాబు నాయుడు లోకేశ్‌ను, రాజశేఖర్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డిని, కరుణానిధి స్టాలిన్‌ను వారసులుగా ప్రకటించి అధికార పగ్గాలప్పజెప్పారే

కానీ వేరెవరికి ఇవ్వలేదు. ఇవేవీ వంశ పారంపర్యాలు కావుగాని కె.సి.ఆర్. ఒకవేళ కె.టి.ఆర్.కు ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తే అది వంశ పారంపర్యమౌతుందా? ఇప్పుడున్న ఏ ఒక్క పార్టీ నాయకుడైన తానే సర్వమై పార్టీని గెలిపించి ఇతరులను ఏలుకొమ్మని ఇచ్చేవాడున్నాడా? దీనర్థం వంశపారంపర్య రాజకీయాలకు సమర్దించడం కాదుకాని సమర్ధుడైన నాయకుడుంటే తనవాళ్ళకు అధికారం అప్పగించడం తప్పేం కాదు. అలాంటిదే కె.టి.ఆర్. విషయం కూడా.

కె.టి.ఆర్. సమర్ధవంతుడైన యువ నాయకుడు. ఈ ఆరేడేళ్లుగా చేస్తున్న మంత్రి పదవులను, పార్టీ అధ్యక్ష పదవీ బాధ్యతలను నిర్వహిస్తున్న తీరును గమనిస్తే ప్రజామోదాన్ని పొందడంలో తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. తనదైన ముద్రతో పథకాలు రచిస్తూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తాను స్వతంత్ర, ప్రత్యేకమైన వ్యక్తిత్వం గల మనిషిగా, ప్రజానాయకుడిగా ముందుకెళ్తున్నాడు. విద్యాధికుడైన కె.టి.ఆర్. విదేశాల్లో ఉన్న అనుభవంతో మరింత లోకజ్ఞానాన్ని పెంచుకున్నాడు. తండ్రి బాటలో తెలుగులో అచ్చమైన, స్వచ్ఛమైన తెలంగాణా జీవద్భాషలో ఉపన్యాసాలిస్తూనే-వి దేశీయులతో, జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో ప్రపంచ భాష ఇంగ్లీషులో అనర్గళంగా ఉపన్యసిస్తున్నారు. ప్రతిపక్షాలపై సెటైర్లు వేయడంలోను, పారిశ్రామికవేత్తలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షించడంలోను కె.టి.ఆర్. ముద్ర ప్రత్యేకమైంది.

తెలంగాణను ఐ.టి. హబ్ గా మార్చడంతో పాటు హైదరాబాదేతర ప్రాంతాల్లో ఐ.టి.ని విస్తరింపజేసి అభివృద్ధి వికేంద్రీకరణలో ముందున్నారు. తెలంగాణ యువతరానికి మాత్రమే కాదు చిన్నతనంలోనే అతిపెద్ద బాధ్యతలను స్వీకరించిన, సమర్ధవంతంగా నిర్వహిస్తున్న భారతీయ యువతకు స్ఫూర్తి. ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా పెద్దలను గౌరవించే వినయశీలత అతని సొత్తు. ఆరేళ్లుగా ఐ.టి. మునిసిపల్ శాఖలను నిర్వహిస్తున్న తీరు రాష్ట్రాన్ని సమర్ధవంతంగా పాలించగలడన్న భరోసాను తెలంగాణ ప్రజల కిస్తున్న నేత యువకిశోరం కె.టి.ఆర్.

ప్రస్తుతం భారతదేశ రాజకీయాల్లో ఉన్న యువనేతలను పరిశీలిస్తే అఖిలేశ్ యాదవ్, తేజస్వి యాదవ్, కె.టి.ఆర్. జగన్ మోహన్ రెడ్డి, స్టాలిన్‌లు పార్లమెంటరీ రాజకీయాల్లో ఆశాకిరణాలుగా కనబడుతున్నారు. వీళ్ళేవరికీ తండ్రుల వల్ల మాత్రమే రాజకీయోన్నతి లభించలేదు. రాజకీయ రంగ ప్రవేశం కల్పించడానికి మాత్రమే వారసత్వ రాజకీయాలు ఉపయోగపడ్డాయి. వీరు తమను తాము సమర్ధవంతులైన నాయకులుగా, రాష్ట్రాలను ఏలగల దక్షులుగా, భవిష్యత్ దేశనాయకులుగా నిరూపించుకుంటున్నారు. కె.టి.ఆర్. తండ్రి తనకు అప్పగించిన మంత్రివర్గ శాఖలు, పార్టీ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూనే తండ్రి తనకు రాష్ట్ర పాలన పగ్గాలు అప్పగిస్తే అంతే సమర్ధవంతంగా చేయగలనని గత రెండు మూడు సంవత్సరాలుగా అనేక సందర్భాలలో రుజువు చేశారు, – చేస్తున్నారు.

హైదరాబాద్ చుట్టూ వచ్చిన ఐ.టి. పరిశ్రమలు, ఫార్మా హబ్ లు, రాష్ట్రమంతటా విస్తరిస్తున్న ఐ.టి. తద్వారా లభిస్తున్న లక్షలాది ఉద్యోగావకాశాలకు కె.టి.ఆర్. నిరంతర కృషే కారణం. కె.సి.ఆర్. వ్యవసాయాన్ని పండుగగా చేసి, గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడంలో నిమగ్నమైతే, కె.టి.ఆర్. పట్టణాలను పారిశ్రామిక కేంద్రాలుగా, ఉద్యోగ కల్పనా కేంద్రాలుగా మార్చడంలో ముందున్నరు. ఈ రెండింటినీ మేళవించి యువనేత కె.టి.ఆర్. తనకు లభించిన తెలంగాణ రాష్ట్ర పాలనావకాశాన్ని అర్ధవంతం చేస్తాడనడంలో సందేహం లేదు. హైదరాబాద్ ఈ రోజు ఏ రాష్ట్రంలోని వారికైనా, విదేశీయులకైనా నివాసయోగ్యప్రాంతం’గా భావింపబడుతున్నదంటే అందుక్కారణం కె.సి.ఆర్. ప్రభుత్వం, మంత్రిగా కె.టి.ఆర్. కృషే.

నెహ్రూ తర్వాత ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ సమర్ధవంతులైన నాయకులు కాబట్టే వారసత్వంగా తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని దేశాన్నేల గలిగారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఆ స్థానాన్ని పూరించ లేదు కాబట్టే అధికారంలోకి రాలేకపోయారు. రాష్ట్రాన్ని, దేశాన్నేలిన పి.వి. నరసింహారావు తన వారసత్వంగా సంతానాన్ని మలుచలేక పోయారు. చంద్రబాబు నాయుడు ప్రయత్నించినా లోకేశ్ సామర్ధ్యం ఆ పదవినందుకొనే స్థాయి కెదుగలేదు. చెన్నా రెడ్డి ఇతరులు విషయంలోను అంతే జరిగింది. తండ్రి సమర్ధుడు రాజకీయ చతురుడు అయినంత మాత్రాన అతని వారసుడు ఆ స్థాయివాడు కాకుంటే వారసత్వ రాజకీయాలకు త్వరలోనే ముగింపు లభిస్తుంది. ఇక్కడ కె.సి.ఆర్., కె.టి.ఆర్. ఇద్దరూ సమర్ధవంతులైన, విశేషంగా ప్రజాదరణ ఉన్న నాయకులే. ఒంటి చేత్తో పార్టీని గెలిపించగల ఉద్దండులే. ఒకరు ఢక్కా మొక్కీలు తిని, ప్రజల్లోంచి, తెలంగాణ ప్రాంత రాజకీయావసరాల్లోంచి ఎదిగిన నేత.. మరొకరు తండ్రి నుంచి విశేషంగా రాజకీయానుభవాలు పొంది, తెలంగాణ రాష్ట్రోద్యమ అవసరాల్నుంచి ఎదిగిన నాయకుడు.

ఒకరు స్వాతంత్య్రానంతరం ఆ తర్వాతి తరం ప్రతినిధి అయితే, మరొకరు ఈ తరం ప్రతినిధి. ఈ మూడు తరాలను కలుపుకొని భవిష్యత్తరాలకు ఆశాజ్యోతిగా ఉండాల్సిన నాయకుడు కె.టి.ఆర్. తెలంగాణకు ముఖ్యమంత్రి అవడం ఖాయం. అది నేడేనా, రేపా, ఎల్లుండా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఈ బాధ్యత తెలంగాణ ఆత్మను, అంతరాత్మను, తెలంగాణ జీవనాడిని ఎరిగిన కె.సి.ఆర్. నిర్ణయిస్తారు. టి.ఆర్.ఎస్. ఎమ్మెలేల్లు నిర్ణయిస్తారు, అంతే కానీ వారసత్వమనో, కుటుంబ పాలననో అనవసర చర్చలు లేవదీయడం వల్ల ఫలితమేముంటుంది? ప్రయోజనమేముంటుంది? తానే మరో ఐదేళ్ళ తెలంగాణ ముఖ్యమంత్రినని సంపూర్ణ ఆత్మ విశ్వాసంతో చెప్పి అందరి నోళ్ళు మూయించిన కె.సి.ఆర్. అభినందనీయులు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News