రేపు ధర్మాసనం విచారణ
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి మద్రాస్ హైకోర్టు తమపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిందని ఎన్నికల కమిషన్ సుప్రీం కోర్టుకు శనివారం ఫిర్యాదు చేసింది. ఐదు రాష్ట్రాల్లో ఆదివారం ఓట్ల లెక్కింపు జరగనున్న సందర్భంగా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయడం గమనార్హం. తమిళనాడులో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతుండగా ఎన్నికల ప్రచార ర్యాలీలను ఆపలేక పోయినందుకు ఎన్నికల కమిషన్‌పై హత్య కేసు నమోదు చేయాలని మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 26న తీవ్రంగా వ్యాఖ్యానించింది.
తరువాత తన ఉత్తర్వులో కరోనా మరింత విజృంభించడానికి ఎన్నికల కమిషన్ ప్రేరకమైనందుకు మూల్యం కట్టలేమని కూడా వ్యాఖ్యానించింది. మద్రాస్ హైకోర్టు నిర్మొహమాటంగా, అవమానకరమైన వ్యాఖ్యలు చేసిందని ఎన్నికల కమిషన్ తన ఫిర్యాదులో సుప్రీం కోర్టుకు వివరించింది. మద్రాస్ హైకోర్టు స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ అయినప్పటికీ, ఎలాంటి ఆధారం లేకుండా మరో స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థపై హత్యను ఆపాదిస్తూ ్త తీవ్రమైన ఆరోపణలు చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. డాక్టర్ చంద్రచూడ్, ఎంఆర్ షా నేతృత్వం లోని ధర్మాసనం ఈ ఫిర్యాదుపై సోమవారం విచారణ చేపట్టనున్నది.