న్యూఢిల్లీ : వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్ చావో రేవోగా మారింది. ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే రానున్న మ్యాచుల్లో విజయాల్లో సాధించడం తప్ప మరో మార్గం హైదరాబాద్ కు లేకుండా పోయింది. ఇక జట్టు వరుస పరాజయాల నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ను తప్పించారు. అతని స్థానంలో మిగిలిన మ్యాచ్‌లకు కేన్ విలియమ్సన్ సారథ్యం వహిస్తాడు. ఇక కొత్త కెప్టెన్ విలియమ్సన్‌కు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఇప్పటికే కెప్టెన్‌గా న్యూజిలాండ్‌ను విజయపథంలో నడిపిస్తున్న కేన్‌కు హైదరాబాద్‌ను ముందుకు నడిపించడం పెద్ద ఇబ్బందేమి కాక పోవచ్చు. అయితే ప్రస్తుతం జట్టులో ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది. వరుస ఓటములతో జట్టు సతమతమవుతోంది. దీంతో ఇకపై జరిగే మ్యాచు ల్లో కూడా విజయం సాధించడం అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. బ్యాటింగ్ వైఫల్యాలు జట్టును వెంటాడుతున్నాయి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. అయితే నిలకడలేమి జట్టుకు ప్రధాన సమస్యగా తయారైంది. బ్యాట్స్‌మె న్ ఫామ్ కోసం తంటాలు పడుతున్నారు. ప్రతి మ్యాచ్‌లో కూడా జట్టును బ్యాటింగ్ ఇబ్బందులు వెంటాడుతున్నా యి. వేగంగా ఆడడంలో వార్నర్, మనీష్ పాండే తదితరులు విఫలమవుతున్నారు. దీని ప్రభావం జట్టు బ్యాటింగ్‌పై పడుతోంది. బెయిర్‌స్టో బ్యాటింగ్‌లో కూడా నిలకడగా కనిపించడంలో లేదు. ఒక మ్యాచ్‌లో రాణిస్తే తర్వాతి మ్యాచ్‌లో నిరాశ పరుస్తున్నాడు. ఇలాంటి స్థితిలో రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా జట్టుకు బ్యాటింగ్ ఇబ్బందులు వెంటాడే ప్రమాదం ఉంది.
ఆ లోపాన్ని సవరించుకుంటేనే..
దీంతో బ్యాటింగ్ లోపాన్ని సరిదిద్దు కోవాల్సిన అవసరం జట్టుకు ఎంతైనా ఉంది. బ్యాటింగ్ మెరుగు పడక పోతే మరిన్ని ఓటములు ఖాయమని చెప్పొచ్చు. ఇకపై జరిగే మ్యాచుల్లో వార్నర్, బెయిర్‌స్టో, విలియమ్సన్, మనీష్ పాండే, కేదార్ జాదవ్ తదితరులు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. కీలక బ్యాట్స్‌మెన్ రాణిస్తే మిగిలిన మ్యాచుల్లో హైదరాబాద్ పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంటుంది. బౌలర్లు బాగానే రాణిస్తున్నా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. ఈ ఒక్క మ్యాచ్‌లో తప్ప బౌలర్లు తమ బాధ్యతలను సక్రమంగానే నిర్వర్తించారు.
రాయల్స్‌ది అదే పరిస్థితి..
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. ఆరు మ్యాచుల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. నాలుగింటిలో ఓటమి పాలైంది. దీంతో హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో గెలుపే లక్షంగా పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బాగానే ఉన్నా నిలకడలేమి జట్టుకు ప్రధాన ఇబ్బందిగా తయారైంది. ఈ మ్యాచ్‌లో రెండు విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేస్తేనే హైదరాబాద్‌ను ఓడించే అవకాశం ఉంటుంది. లేకుంటే ఈ మ్యాచ్‌లో కూడా రాజస్థాన్‌కు ఇబ్బందులు తప్పక పోవచ్చు.
ఢిల్లీతో పంజాబ్ ఢీ..
ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. కిందటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించిన పంజాబ్ ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. హర్‌ప్రీత్ బరార్ రూపంలో పంజాబ్‌కు కొత్త అస్త్రం లభించింది. కిందటి మ్యాచ్‌లో అతను ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతని నుంచి జట్టు అలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. ఇక కెప్టెన్ రాహుల్ కూడా ఫామ్‌లో ఉన్నాడు. గేల్ తన విధ్వంసక బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. మరోవైపు ఢిల్లీ కూడా వరుస విజయాలతో జోరుమీదుంది. ఇప్పటికే ఐదు విజయాలు సాధించిన ఢిల్లీ ఈసారి కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్‌లు ఫామ్‌లో ఉండడం జట్టుకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
హైదరాబాద్‌కు చావో రేవో నేడు రాజస్థాన్‌తో కీలక పోరు
- Advertisement -
- Advertisement -
- Advertisement -