జయ ఫొటో ఉన్న ఫ్లెక్సీ ధ్వంసం
సార్టీనుంచి సస్పెండ్ చేసిన స్టాలిన్
చెన్నై: తమిళనాడులో డిఎంకె తిరిగి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ కార్యకర్తలు కొందరు రెచ్చిపోతున్నారు. చెన్నైలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అమ్మ క్యాంటీన్లపై కొందరు డిఎంకె కార్యకర్తలు దాడి చేసి దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత(అమ్మ) ఫొటో ఉన్న ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డిఎంకె పార్టీ ఆ కార్యకర్తలపై వేటు వేసింది. దాడి చేసిన ఇద్దరు డిఎంకె కార్యకర్తలను పార్టీనుంచి బహిష్కరించడమే కాక, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పార్టీ అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ అదేశించినట్లు చెన్నై మాజీ మేయర్ మా సుబ్రమణియన్ విలేఖరులకు చెప్నారు.
అంతే కాకుండా తొలగించిన ఫ్లెక్సీలను అదే ప్రాంతంలో తిరిగి ఏర్పాటు చేయాలని కూడా పార్టీ అధ్యక్షుడు అదేశించినట్లు ఆయన చెప్పారు. డిఎంకె కార్యకర్తలు అమ్మ ఫొటో ఉన్న ఫ్లెక్సీలను తొలగించడాన్ని అక్కడే ఉన్న పార్టీకి చెందిన మరి కొందరు కార్యకర్తలు తమాషా చూస్తున్నట్లుగా చూస్తూ నుంచున్న దృశ్యాలను కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమ ఫోన్ కెమెరాలో బంధించారు. అన్నా డిఎంకె కూడా ఈ దృశ్యాలను తన ట్విట్టర్‌లో ఉంచింది.