న్యూఢిల్లీ : సాఫీగా సాగిపోతున్న ఐపిఎల్‌లో కరోనా కల్లోలం సృష్టించింది. దీని దెబ్బకు ఏకంగా ఐపిఎల్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. టోర్నీ వాయిదా పడిన నేపథ్యంలో నిర్వహణ ఏర్పాట్లపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూఎఇ వేదికగా కిందటి ఐపిఎల్ ఎలాంటి ఆటంకం లేకుండా విజయవంతంగా ముగిసింది. కానీ భారత్‌లో నిర్వహించిన ఐపిఎల్ సీజన్14 సందర్భంగా పలువురు క్రికెటర్లు, సహాయక సిబ్బంది కరోనా బారిన పడడం చర్చనీయాంశంగా మారింది.
ఐపిఎల్ నిర్వహణ కోసం సృష్టించిన బయో బుడగలో లోపాలున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటగాళ్లకు ఇచ్చిన జిపిఎల్ ట్రాకింగ్ బ్యాండ్లు పని చేయలేదా? వాటి నాణ్యత అంతంత మాత్రంగానే ఉందా? కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించి రికార్డు చేయలేదా అంటే కొన్నింటికి ఔననే సమాధానం మాత్రమే వస్తోంది. లీగ్ కోసం భారత క్రికెట్ బోర్డు భారీ బయో బబుల్ బుడగలను సృష్టించింది. తొలుత ముంబై, తర్వాత చెన్నై నగరాల్లో వీటిని ఏర్పాటు చేసింది. ఆటగాళ్లను క్వారంటైన్‌లో ఉంచడం, ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించడం విషయంలో బిసిసిఐ సక్సెస్ అయిందనే చెప్పాలి.
అయితే క్రికెటర్ల కదలికలను గుర్తించడానికి ఇచ్చిన బ్యాండ్లు మాత్రం సరిగ్గా పనిచేయడం లేదనే విషయం బహిర్గతమైంది. ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లిన సమాచారాన్ని ఈ బ్యాండ్లు గుర్తించలేక పోయింది. దీంతో బ్యాండ్ల నాణ్యతపై ఫ్రాంచైజీ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఒకవేళ నాణ్యత కలిగిన బ్యాండ్లను ఉపయోగించి ఉంటే ఆటగాళ్ల కదలికలను ఎప్పటి కప్పుడు గుర్తించి వారు కరోనా బారిన పడకుండా చూసే అవకాశం ఉండేదని వారు పేర్కొంటున్నారు.