షాజహాన్‌పూర్(యుపి): కరోనా వైరస్ కారణంగా మరణించిన ఒక 70ఏళ్ల హిందూ వృద్ధురాలి మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేయడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో స్థానిక విలేకరిగా పనిచేస్తున్న ఒక ముస్లిం యువకుడు తానే ముందుండి ఆమె దహన సంస్కారాలు పూర్తి చేసి సమాజంలో ఇప్పటికీ మానవత్వం బతికే ఉందని చాటాడు.
ప్రభుత్వం నిర్వహించే షెల్టర్ హోమ్‌లో నివసిస్తున్న సునీతా దేవి(70)కి జ్వరం, ఊపిరి అందకపోవడం వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడడంతో ఆమెను ఏప్రిల్ 5వ తేదీన ఇక్కడి వైద్య కళాశాల అత్యవసర విభాగానికి తీసుకువచ్చారు. ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స పొందుతూ ఆమె ఏప్రిల్ 29న కన్నుమూశారు. ఆమె మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో ఆరు రోజుల పాటు మృతదేహం మార్చురీలోనే ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న మీరజుద్దీన్ ఖాన్ మార్చురీలోని మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించడానికి ముందుకు వచ్చారు. బీరు అనే అంబులెన్స్ డ్రైవర్ సహాయంతో మృతదేహానికి అంత్యక్రియలని ఆయన నిర్వహించినట్లు వైద్య కళాశాల ప్రజా సంబంధాల అధికారి పూజా త్రిపాఠి తెలిపారు. కాగా, సుదామ దేవి అనే మరో 60 ఏళ్ల వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె కుమార్తెకు ఖాన్ ధనసహాయం చేసినట్లు త్రిపాఠి చెప్పారు.
Muslim man perform last rites of hindu woman’s body