Friday, November 22, 2024

చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

Central Government hands up on Corona

 

పదిహేనేళ్ళ క్రితం బొమ్మరిల్లు అనే తెలుగు సినిమా రిలీజ్ అయింది. అందులో సిద్ధార్థ హీరో. తన కొడుకును ఎలా పెంచాలో, తన కొడుకు తన అదుపాజ్ఞల్లో ఎలా మెలగాలో నియంత్రించే తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. సినిమా ఆఖరిలో క్లైమాక్స్ సీన్‌లో సిద్ధార్థ, ప్రకాష్ రాజ్ తో మీరే కారణమని కొడుకు తండ్రిని బాధ్యుడిని చేస్తారు. ‘అంతా మీరే చేశారు నాన్న’ అనేది సిద్ధార్థ్ డైలాగ్. సినిమా విడుదలై విజయవంతంగా నడిచిన తర్వాత దశాబ్దం తర్వాత కూడా ఇది చాలా పాపులర్ డైలాగ్‌గా ఉండిపోయింది. అచ్చంగా అలాగే దేశ వ్యాప్తంగా మోడీ తన పాపులారిటీ కోసం తానే ఒక్కడై అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కాకతాళీయంగా జరిగే మంచికి కూడా తానే క్రెడిట్ గా తీసుకోవాలని చూస్తున్నాడో చెడుకి కూడా ఆయనే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ సమాజ సహజ సూత్రాన్ని ఆధారం చేసుకొనే కరోనా సంక్షోభంలో దేశ వ్యాప్తంగా జరుగుతున్న కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న దిశలో మోడీనే విమర్శించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ బొమ్మరిల్లు సినిమా లోని తండ్రిలాగా దేశానికి కూడా తానే పెద్ద మనిషిగా ఉంటున్నట్లు తండ్రి పాత్రలో వ్యవహరిస్తున్నారు. కనుక ఆయనను ఒక్కడినే బాధ్యుడిని చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

కొవిడ్ సంక్షోభంలో భారతదేశానికి దేవుడో, ప్రకృతో ఇచ్చిన అదృష్టాల్ని మన ప్రభుత్వాలు జార విడుచుకున్నాయి. జాతీయ స్థాయి లో, రాష్ట్రాల్లో కూడా. ప్రపంచంలోని చాలా దేశాల్లో వచ్చిన మాదిరి మన దేశంలో కూడా కరోనా మొదటి దశలోనే విజృంభించి ఉంటే ఇప్పటికే ప్రజారోగ్య వ్యవస్థ ఇప్పటి కంటే ఎక్కువే కుప్పకూలిపోయి ఉండేది. కానీ జన్యుపరంగానో, ఆహారపరంగానో, మరో కారణంగానో మనకు కరోనా మొదటి దశ తీవ్రత నుంచి కొంతవ రకు వెసుబాటు లభించింది. ప్రస్తుతం మొదటి దశ కంటే పది రెట్లు తీవ్రంగా రెండవ దశ ముంచుకొచ్చింది.

భారతదేశ చరిత్రలో గత కొన్ని దశాబ్దాలో ఏ నాయకుడికీ దక్కని గొప్ప ప్రజాదరణ మన ప్రధాన మంత్రి మోడీకి లభించింది. చాలా ఎన్నికలలో ప్రజా తీర్పును ఇప్పటికీ అర్థం చేసుకోలేని రీతిలోనే కొవిడ్ నివారణకు తీసుకోవాల్సిన ప్రజారోగ్య జాగ్రత్తల విషయం లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విఫలమయ్యారు. వైఫల్యానికి మోడీ ఒక్కరినే ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకు వస్తోందంటే ప్రభుత్వం, సొంత పార్టీ, మిత్రపక్షాలనే తేడా లేకుం డా ప్రతి అంశాన్నీ ఆయన తన చుట్టూనే కేంద్రీకృతం చేసుకుంటున్నారు. ప్రతి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. కనుకనే దేశంలో జరుగుతున్న మంచికైనా, చెడ్డకైనా ఆయనే బాధ్యత వహించాల్సిన అనివార్య పరిస్థితి ఆయనకు ఆయనే తెచ్చుకున్నారు.

కొవిడ్ వైరస్‌లో మార్పు గురించి మన దేశంలో పరిశోధనను నామమాత్రంగా ఉండటం వల్ల సరైన సమాచారం లేదని తెలిసినా, ఇతర దేశా అనుభవాలను, మన శాస్త్రజ్ఞుల అంచనా మన ప్రభుత్వాలను హెచ్చరిస్తూనే ఉన్నా లెక్కచేయకుండా కొవిడ్‌పై మనం విజయం సాధించేశామని ప్రధాని ప్రకటించారు. యధా ప్రధానమంత్రి తధా ముఖ్యమంత్రులు అనే రీతిలో కొందరు తప్ప చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా కొవిడ్ నిబంధనను గాలికొదిలేశారు. ఒక్కోసారి చేయడానికి రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద అవసరమైనంత అధికారం కూడా లేదు. దీనికి తోడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా స్థానిక ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చాయి. జాతీయ స్థాయిలో అసోం, పశ్చిమ బెంగాల్ నుంచి పుదుచ్చేరి దాకా అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగోలా గెలిచిపోవాలని ప్రధానితో సహా రాజకీయ నాయకులందరూ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూనే విచ్చలవిడిగా ఎన్నికల ప్రచార సభలలో పాల్గొన్నారు. అధికారమే అంతిమ లక్ష్యంగా పోరాడే రాజకీయం మాత్రమే ప్రస్తుత రాజకీయంగా మారింది. గత ఆరు నెలలుగా మన నేతలంతా ఎన్నికల ప్రచారంలో తలమునకయ్యారు.

ప్రజాస్వామ్యానికి ఎన్నికలు అవసరమే. కానీ ఆక్సిజన్ పాంట్ల నిర్మాణానికి టెండర్లను, సరఫరాకు ఏర్పాట్లను కూడా పట్టించుకోకుండా, కొవిడ్ నిబంధనలను కూడా పాటించకుండా, రాజకీయం చేసేవారు ప్రస్తుతం ఉన్న చోట కాకుండా మరోసారో, ఇంకో చోటో గెలిచి ఏమి ఉద్ధరిస్తారు? అన్నది అసలైన ప్రశ్న. చివరికి టీకాకు ప్రపంచ రాజధానిగా భారత్‌కు ఉన్న అద్భుతావకాశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు వీరందరూ కలిసి భారతదేశాన్ని కొవిడ్ రెండో దశ ప్రమాదంలోకి నెట్టారు. ప్రభుత్వాల నేరపూరిత నిర్లక్ష్యం వల్ల నివారించదగ్గ అనేక మరణాలకు ఈ పార్టీలే, ఈ నాయకులే కారణమయ్యారు.

ఇంత సంక్షోభం వచ్చాక కూడా ఇంకా మేలుకోకుండా, పార్టీకతీతంగా వ్యవహరించకుండా నిస్సిగ్గుగా ఒకరి మీద ఒకరు రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మరోవంక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమాద నివారణ చర్యలు తీసుకోకుండా ఉదాసీనతతో వ్యవహరిస్తుండడంతో పరిస్థితులు మరింత సంక్షోభానికి దారి తీస్తున్నాయి.ఆస్పత్రుల్లో రోగులకు ఆక్సిజన్ అందకపోవటానికి కారణం నువ్వంటే నువ్వని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల, పెద్దలు పరస్పరం ఒకరి మీద ఒకరు ఆరోపణల రాళ్లను రువ్వుకుంటున్నారు. ఆక్సిజన్ అందక మరణించిన వారి చుట్టూ శవ రాజకీయాలు చేస్తున్నారు. టీకా ధర, పంపిణీ విషయంలోనూ అంతే బాధ్యతారహిత రాజకీయం చేస్తున్నారు. ఇటువంటి క్లిష్టమైన సమయంలో కూడా ఇలా ప్రజల ప్రాణాలను పట్టించుకోకుండా రాజనీతిజ్ఞతని, నాయకత్వ సామర్థ్యాన్ని ఇంకెప్పుడు ప్రదర్శిస్తారన్న ప్రశ్న మనకు ఉదయిస్తుంది.

వాస్తవానికి మన దేశంలో ప్రజారోగ్యం విషయంలో ఘోర వైఫల్యానికి జాతీయ స్థాయి సర్కారుతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంతవరకు బాధ్యత వహించాలి. కానీ వీరు ప్రజారోగ్యం విషయంలో కుమ్మక్కయినట్లు, కుట్ర పన్నినట్లు కలసి భ్రష్టుపట్టించారు. కొన్ని రాష్ట్రాలు ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొనే చిట్కాగా ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఓట్లు కొల్లగొట్టే రాజకీయాన్ని అవలంబిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా దాన్నే కాస్త అటూ ఇటూ మార్చి మసిపూసి మారేడు కాయ చేసినట్లు దేశ వ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ పేరుతో ఒక ఆరోగ్య పథకం ప్రవేశపెట్టి తనదైన రీతిగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసింది.

కేంద్రంలో, రాష్ట్రాల్లో ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో కేటాయింపు మొక్కుబడిగా ఉంది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల కంటే తీసికట్టుగా ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపు చేస్తున్నారు. చేసిన కేటాయింపుల్ని కూడా సరైనరీతిలో ఖర్చు చేయటం లేదు. ప్రజకు ఆరోగ్యాన్ని అందించేలా ప్రాథమిక స్థాయి నుంచి వైద్యాన్ని బలోపేతం చేయకుండా తృతీయ స్థాయిలో ప్రయివేటు, కార్పొరేటు ఆస్పత్రులకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు. ఇంత సంక్షోభం తర్వాతైనా అనారోగ్యకర రాజకీయం అంతమవ్వాలి. కొవిడ్ రెండో దశ సంక్షోభాన్ని ప్రభుత్వాలు ఒక అవకాశంగా తీసుకోవాలి. కొవిడ్‌ను ఎదుర్కొనే అన్ని చర్యలనూ తీసుకోవటంతో పాటు ప్రజలందరికీ ఉచితంగా టీకాను అందించాలి. వ్యాపారం చేయటం ప్రభుత్వాల పని కాదు గానీ ప్రజలకు ఆరోగ్యాన్ని అందించటం ప్రభుత్వాల బాధ్యతేనని అంగీకరించాలి. వ్యాక్సిన్ ప్రజలకు అందించే విషయంలో ఇతర దేశాల అనుభవాలను ఆదర్శంగా తీసుకోవాలి. మన జాతీయ టీకా విధానాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వమే టీకా ఆర్థిక భారాన్ని పూర్తిగా మోయాలి. వ్యాక్సిన్లు, ఇతరత్రా కొవిడ్ నియంత్రణ కోసం చేసే ఖర్చును పెంచాలి.

కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే మొత్తం బడ్జెట్ లో ఇక మీదట ప్రతి సంవత్సరానికి ఒక లక్ష కోట్ల రూపాయలు ఆరోగ్య బడ్జెట్‌కే అదనపు కేటాయింపులు చేయాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో 35 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన భారత్‌కు ఏటా ఈ కొద్ది మొత్తాన్ని ఆరోగ్యరంగానికి అదనంగా కేటాయించడం పెద్ద సమస్య కాదు. ఇలా చేసినా కూడా ఆరోగ్య రంగానికి కేటాయింపుల్లో భారత్ మిగతా అభివృద్ధి చెందిన దేశాల కంటే వెనుకబడే ఉంటుంది. కానీ అదనంగా లక్ష కోట్ల కేటాయించి సరైన రీతిలో ఖర్చు చేస్తే మన దేశంలో ప్రతి ఒక్కరికీ తమ సొంత జేబులో నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ప్రజారోగ్యం అందుబాటులోకి వస్తుంది. అనారోగ్యం వల్ల ప్రస్తుతం మన దేశం కోల్పోతున్న పని గంటలు, పని రోజులు ఆదా అవుతాయి. కొత్తగా కోటి మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయి. ఈ సంక్షోభ కష్ట కాలాన్ని త్వరగా అధిగమించేందుకు ప్రజలందరూ ప్రభుత్వంతో సహకరిస్తూనే, బలమైన ప్రజారోగ్య వ్యవస్థ కోసం ప్రభుత్వాలను గట్టిగా నిలదీయాలి. డిమాండ్ చేయాలి. అడగందే అమ్మయినా పెట్టదు కదా!.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News