వెనుకబడిన జిల్లాల్లో తొలి దశతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగిన కరోనా కేసులు, మరణాలు
5 రాష్ట్రాల్లోనే సగానికి పైగా జిల్లాలు
గ్రామాల్లో అంతంత మాత్రంగానే ఉన్న వైద్య సదుపాయాలు
పట్టణాలకు పరుగులు పెడుతున్న కరోనా బాధితులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆసేతు శీతాచలం దాదాపుగా అన్ని రాష్ట్రాలను వణికిస్తున్నప్పటికీ ఈ సారి ప్రత్యేకంగా చెప్పుకోదగంగ పరిణామం ఏమిటంటే గత ఏడాది సెప్టెంబర్‌లో కరోనా తొలి దశ తారస్థాయికి చేరుకున్న దశతో పోలిస్తే దేశంలోని వెనుకబడిన జిల్లాల్లో ఈ సారి కేసులు అలాగే మరణాలు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ నిధి(బిఆర్‌జిఎఫ్) కిందికి వచ్చే జిల్లాలు దేశంలో 272 ఉండగా వీటిలో 243 జిల్లాలకు సంబంధించిన గణాంకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ గణాంకాలను పరిశీలించినట్లయితే గత ఏడాది సెప్టెంబర్ 16న దేశంలో కోవిడ్ తారస్థాయిలకి చేరకున్న దశతో పోలిస్తే ఇప్పుడు ఈ జిల్లాల్లో కొవిడ్ కేసులు నాలుగు రెట్లు ఎక్కువ ఉన్నాయి. గత ఏడాది 9.5 లక్షల మంది కరోనా సోకిన వారు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 39.6 లక్షలకు పైగా ఉంది. ఈ జిల్లాల్లో యాక్టివ్ కేసుల భారం కూడా ఎక్కువగానే ఉంది. తొలి దశతో పోలిస్తే ఈ జిల్లాల్లో యాక్టివ్ కేసులు 4.2 రెట్లు ఎక్కువగా ఉన్నాయి.
ప్రస్తుతం ఈ జిల్లాల్లో 7.15 లక్షల మంది కరోనా సోకిన వారున్నారు. దీంతో ఇప్పటికీ అరకొరగా ఉన్న ఈ ప్రాంతాల్లోని ఆస్పత్రులు, ఇతర వైద్య సేవా వ్యవస్థలపై పెను భారం పడుతోంది. ఈ జిల్లాల్లో సంభవించిన మరణాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఈ నెల 5వ తేదీనాటికి ఈ జిల్లాలన్నిటిలో కలిపి 36,523 మంది కొవిడ్ కారణంగా మరణించారు. అంటే తొలి దశ తారస్థాయిలో ఉన్న సమయంలో మరణించిన వారితో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ జిల్లాల్లో చనిపోయిన వారి సంఖ్య 9,555 మంది మాత్రమే.
దేశంలో బిఆర్‌జిఎఫ్ పథకం కిందికి వచ్చే జిల్లాల్లో దాదాపు 54 శాతం కేవలం 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. బీహార్‌లో 38, ఉత్తరప్రదేశ్‌లో 35, మధ్యప్రదేశ్ లో 30, జార్ఖండ్‌లో 23, ఒడిశాలో 20 జిల్లాలున్నాయి. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో పనిమనుషులు మొదలుకొని నిర్మాణ పనుల దాకా అన్ని రకాల పనులకు అవసరమైన వలస కార్మికులను అందించే ప్రధాన రాష్ట్రాలు కూడా ఇవే కావడం గమనార్హం. కరోనా వైరస్ కేసులకు సంబంధించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల వివరాలు అధికారికంగా అందుబాటులో లేకపోయినప్పటికీ ఈ జిల్లాల్లో కరోనా కేసులు మరణాలను విశ్లేషించినట్లయితే గ్రామీణ ప్రాంతాలకు కరోనా సెకండ్ వేవ్ ఎంత వేగంగా విస్తరిస్తోందో అర్థమవుతుంది. కచ్చితంగా చెప్పాలంటే కరోనా తొలి దశ, రెండో దశ మధ్య ఈ 243 జిల్లాల్లో కరోనా సోకిన వారి సంఖ్య నాలుగు రెట్లు పెరిగిందనేది వాస్తవం.
అయితే దేశంలోని మొత్తం కేసుల్లో ఈ జిల్లాల శాతం మాత్రం చూసినట్లయితే దాదాపుగా ఒకే స్థాయిలో (18.6 శాతం) ఉన్నాయి. అయితే మరణాలు మాత్రం గణనీయంగా పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్ 16 నాటికి ఈ జిల్లాల్లో మరణాలు మొత్తం దేశవ్యాపంగా సంభవించిన 83,198 మరణాల్లో 11.5 శాతం ఉండగా ఇప్పుడు 16 శాతానికి పెరిగాయి. ఈ జిల్లాల్లో చాలా రకు మౌలిక వైద్య సదుపాయాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వైద్య రంగానికి సంబంధించి కొత్తగా కల్పించిన మౌలిక సదుపాయాలు ఏవయినా పెద్ద పట్టణాలు, నగరాలకు మాత్రమే పరిమితం. ఫలితంగా ఈజిలాల్లోని గ్రామీణ ప్రాంతాలనుంచి కరోనా రోగులు దగ్గరలో ఉన్న పట్టణాలకు వరదలా వచ్చిపడుతున్నారు. దీంతో ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న పట్టణాల్లోని ఆస్పత్రులపై మరింత భారం పడుతోంది.