అసోం సిఎంగా హిమంత బిశ్వా శర్మ
ఇప్పటి ఆరోగ్య మంత్రికి బిజెపి పదోన్నతి
సోనోవాల్ రాజీతో ఏకాభిప్రాయం
ఢిల్లీలో సయోధ్య.. తరువాత నేత ఎన్నిక
గువహతి: అసోం తదుపరి ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వా శర్మ ఖరారు అయ్యారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా ఇప్పటివరకూ ఉన్న బిశ్వా శర్మను ముఖ్యమంత్రిగా కొన్ని రోజుల సస్పెన్స్ తరువాత బిజెపి అధిష్టానం ఎంపిక చేసింది. దీనికి అనుగుణంగా ఆదివారం బిజెపి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో శర్మను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఇప్పటివరకూ అసోం తరువాతి సిఎం ఉత్కంఠ వీడింది. ఇప్పటివరకూ సిఎంగా ఉన్న సర్బానంద సోనోవాల్ స్థానంలో బిశ్వా శర్మ ముఖ్యమంత్రి అవుతారని, ఎప్పుడు ఆయన ప్రమాణస్వీకారం ఉంటుందనేది వెల్లడికావల్సి ఉందని అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. ఆదివారం ఉదయం బిజెపి లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. సిఎం సోనోవాల్ హిమంత పేరును శాసనసభాపక్ష నేతగా ప్రతిపాదించారు. దీనికి అంతా ఆమోదం తెలిపారు. పార్టీ అధిష్టానం తరఫున కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పరిశీలకులుగా సమావేశానికి హాజరయ్యారు. లెజిస్లేచర్ పార్టీ భేటీకి ముందు సర్బానంద సోనోవాల్ గవర్నర్ జగదీష్ ముఖిని కలుసుకుని సిఎం పదవికి రాజీనామా పత్రం సమర్పించారు. సిఎం పదవికి సంబంధించి బిశ్వా, సోనోవాల్ మధ్య అభిప్రాయభేదాలు తీవ్రతరం అయ్యాయి. శనివారం ఢిల్లీలో ఇరువురు నేతలువేర్వేరుగా పార్టీ నేతలను, ప్రత్యేకించి అమిత్ షాను కలిసి మాట్లాడిన తరువాత రాజీ ప్రక్రియ కుదిరినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో హిమంత బిశ్వా శర్మ సిఎం కావడానికి మార్గం సుగమం అయింది.
ఈశాన్యపు లీడర్
ఈశాన్య భారతంలో అత్యంత పలుకుబడి, శక్తివంతమైన నేతగా హిమంత బిశ్వా శర్మ పేరు తెచ్చుకున్నారు. అంకితభావం, కష్టించి పనిచేసే తత్వం ఆయనకు ఇప్పుడు సిఎం పదవికి దగ్గరిగా చేర్చాయి. అసోంలో అత్యున్నత పీఠం సిఎం పదవిపై ఆయన చాలా కాలంగానే కన్నేసి ఉంచారు. 52 సంవత్సరాల శర్మ సమర్థతను కొనియాడేవారున్నారు. అదే విధంగా ఆయన రాజకీయ అత్యాశపరుడుని దూషించే వారు ఉన్నారు. అన్ని కేబినెట్‌లలో మంత్రిగా ఉంటూ నాలుగు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చిన శర్మ గతంలో కాంగ్రెస్ నేతలు హితేశ్వర సైకియా, తరుణ్ గొగోయ్ వంటి వారి వద్ద పనిచేశారు. ఆయన ఎదుగుదలకు వీరు సహకరించారు. ఆయనలోని పట్టుదలను గుర్తించి ఈశాన్య కీలక రాష్ట్రంలో బిజెపి పాగాకు అమిత్ షా ఇతర నేతలు పావులు కదిపి ఆయనను పార్టీలోకి లాగారు. తరువాత ఈ పెద్ద చేపను బిజెపి అధిష్టానం బాగా వినియోగించు కుంటూవచ్చింది. ఈ క్రమంలో ఆయన కూడా ఎంతో ఓపిగ్గా వ్యవహరిస్తూ పార్టీలోని సీనియర్లను నొప్పించకుండానే తన ఆధిపత్యం పదిలపర్చుకుంటూ, ఇప్పుడు సిఎంగా దూసుకువచ్చారు.
Himanta Biswa Sarma set to be next Assam CM