మాడ్రిడ్ : ప్రతిష్టాత్మకమైన మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో బెలారస్‌కు చెందిన ఐదో సీడ్ అరినా సబాలెంకా టైటిల్‌ను సాధించింది. ఫైనల్లో సబాలెంకా టాప్ సీడ్ ఆశ్లే బార్టీ (ఆస్ట్రేలియా)ను ఓడించింది. మూడు సెట్ల సమరంలో సబాలెంకా 60, 36, 64తో బార్టీని చిత్తు చేసింది. తొలి సెట్‌లో సబాలెంకా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడిన సబాలెంకా ఒక్క గేమ్ కూడా కోల్పోకుండానే సెట్‌ను సొంతం చేసుకుంది. అయితే రెండో సెట్‌లో మాత్రం అరినాకు చుక్కెదురైంది. ఈసారి టాప్ సీడ్ బార్టీ దూకుడును ప్రదర్శించింది. తన మార్క్ షాట్లతో అలరించిన బార్టీ సునాయాసంగా సెట్‌ను గెలిచి స్కోరును సమం చేసింది. ఇక ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో కూడా పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. అయితే ఆఖరు వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న సబాలెంకా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.