హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఈ భేటీలో తెలంగాణలో లాక్‌డౌన్ పై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా లాక్‌డౌన్ తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలో 2వారాలు లాక్‌డౌన్ విధించే అవకాశముందని పలువురు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో లాక్‌డౌన్ కు ప్రాధాన్యం ఇచ్చే అవకాశముందని సమాచారం. లాక్‌డౌన్ పై నిర్ణయం తీసుకుంటే శనివారం నుంచి అమలు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. లాక్‌డౌన్ తో తలెత్తే సమస్యలపై కూడా కేబినెట్ చర్చించనుంది. కరోనాకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కేంద్రప్రభుత్వ వైఖరి, పరిణామాలు, ప్రత్యామ్నాయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తాత్కాలిక వైద్యసిబ్బంది నియామకాలకు అనుమతిపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లా కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు, రాష్ట్రంలో కోవిడ్ టీకాలు, ఇంజక్షన్లు, ఔషధాల కొరతను అధిగమించడంపై సిఎం మంత్రులతో చర్చించనున్నారు. ఆక్సిజన్ లభ్యత, సరఫరాపై సమావేశంలో మంత్రివర్గం చర్చించనుంది.
Telangana Cabinet meeting begins