ఎఫ్‌డిఎ ఆమోదం : అమెరికా కీలక నిర్ణయం
వాషింగ్టన్ : అమెరికాలో 12- 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు కూడా కరోనా టీకా అందుబాటు లోకి తెచ్చారు. ఇది కరోనాపై పోరులో అమెరికా వేసిన కీలకమైన మరో ముందడుగుగా పేర్కొంటున్నారు. ఫైజర్‌ఎన్ బయోటెక్ తయారు చేసిన కరోనా టీకాను 12 ఏళ్ల వారికి కూడా వినియోగించడానికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) సోమవారం ఆమోదం తెలిపింది. సిడిసి ( వ్యాధి నియంత్రణ, నివారణ సంస్థ ) సలహా బృందం ఈ వివరాలను సమీక్షించిన తరువాత ఫలితాలు ఆశాజనకంగా ఉంటే అత్యవసర వినియోగానికి ఈ సలహా బృందం అత్యవసర వినియోగానికి సిడిసికి బుధవారం సిఫార్సు చేయనున్నట్టు తెలుస్తోంది. సిడిసి అనుమతిస్తే 12 15 ఏళ్ల వారికి టీకా అందుబాటు లోకి వస్తుంది. అమెరికాలో గత ఏడాది మార్చి నుంచి గత నెల 30 వరకు 1117సంవత్సరాల మధ్యనున్న 1.5 మిలియన్ల మంది కరోనా బారిన పడ్డారు.
ఫైజర్ కంపెనీ 1215 ఏళ్ల మధ్య వయసున్న 2000 మందిపై క్లినికల్ ట్రయల్ నిర్వహించి, వ్యాక్సిన్ సమర్ధంగా పనిచేస్తున్నట్టు ప్రకటించింది. అనేక దేశాల్లో ఫైజర్ వ్యాక్సిన్ 16 ఏళ్ల వారికి వినియోగిస్తున్నారు. ఇటీవలనే కెనడా మొట్టమొదటి సారిగా 12 ఏళ్ల వారికి కూడా ఫైజర్ టీకా అనుమతించింది. ఇదే విధంగా అనుమతించాలని ఫైజర్, బయోఎన్‌టెక్ ఐరోపా యూనియన్ దేశాలను అభ్యర్థించాయి. ఫైజర్ ఒక్కటే కాదు, మోడెర్నా కూడా 12 నుంచి 17 ఏళ్ల లోపు వారికి తమ టీకా బాగా పనిచేస్తోందని, అందువల్ల అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతోంది. మరో అమెరికా కంపెనీ నోవావాక్స్ 1217 ఏళ్ల లోపు వారిపై అధ్యయనం ప్రారంభించింది.