నదిలో కొట్టుకొచ్చిన మొత్తం 52 మృతదేహాలు
బలియా(యుపి): మరో ఏడు మృతదేహాలు గంగానదిలో బుధవారం కొట్టుకురావడంతో ఇప్పటివరకు ఉత్తర్ ప్రదేశ్ బలియా జిల్లాలోని గంగానదిలో లభించిన మృతదేహాల సంఖ్య 52కి చేరుకుంది. కొవిడ్-19 కారణంగానే ఈ మృతదేహాలను గంగానదిలో వదిలేసి ఉంటారని అనుమానిస్తున్న జిల్లా యంత్రాంగం వెంటనే ఈ మృతదేహాలకు దహన సంస్కారాలను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం నరహి ప్రాంతంలోని ఉజియా, కుల్హడియా, భరోలి ఘాట్ల సమీపంలో దాదాపు 45 మృతదేహాలు నదిలో తేలియాడుతుండడం కనిపించిందని బలియా వాసులు విలేకరులకు తెలిపారు. మంగళవారం మరో ఏడు మృతదేహాలు నదిలో లభించాయని, దీంతో మొత్తం 52 మృతదేహాలు ఇప్పటివరకు లభించాయని అధికారి ఒకరు తెలిపారు. బలియా-బుక్సర్ వంతెన కింద నదిలో కుళ్లిపోయిన స్థితిలో కొన్ని మృతదేహాలు కనిపించాయని జిల్లా మెజిస్ట్రేట్ అదితి సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారని, మృతదేహాలకు గౌరవప్రదంగా అంతిమసంస్కారాలు నిర్వహించామని ఆమె తెలిపారు.