బుధవారం నాడు లాక్‌డౌన్ కారణంగా ఖాళీగా దర్శనమిస్తున్న హైటెక్‌సిటీ రోడ్లు
తొలిరోజు ప్రశాంతంగా 20 గం.ల లాక్‌డౌన్
చెక్‌పోస్టుల్లో పోలీసుల విస్తృత తనిఖీలు
అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి
అన్ని జిల్లాల్లో అప్రమత్తమైన పోలీసులు
ప్రముఖ ఆలయాల మూసివేత
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్‌డౌన్ నేపథ్యంలో అన్ని జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో లాక్ డౌన్ నిబంధనలు పాటించిన వ్యాపారులు తాజాగా అవే నిబంధనలు పాటించారు. అత్యవసర సేవలకు మినహా మిగతావాటన్నింటిని ప్రజలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఇటు పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా లాక్‌డౌన్ విధుల్లో పాల్గొన్నారు. లాక్‌డౌన్ ప్రకటనతో బుధవారం ఉదయం 10 గంటల తర్వాత ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఈక్రమంలో పది రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కఠినంగా నిబంధనలు చేయనున్నారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు, ఇతర వాహనాలపై నిషేధం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దుల వద్ద ప్యాసింజర్ వాహనాలను నిలిపేసిన పోలీసులు అత్యవసర, సరకు రవాణా వాహనాలకే అనుమతినిస్తున్నారు.
అదేవిధంగా రహదారులపై వాహన చోదకులను తనిఖీ చేసిన పోలీసులు అత్యవసర సేవలకు మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తున్నారు. కరోనా కట్టడికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉదయం 10 గంటల వరకూ నడిచిన దుకాణాలు ఆ తర్వాత ఒక్కొక్కటిగా మూత పడ్డాయి. సుమారు 11 గంటల వరకూ రోడ్లపై జనం కనిపించినా ఆ తర్వాత పలచబడ్డారు. లాక్‌డౌన్ జనాన్ని ఇబ్బంది పెట్టేందుకు కాదన్న పోలీసు అధికారులు వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్‌లో ఉదయం 10 గంటల నుంచి రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. నగరంలో లాక్‌డౌన్ అమలును కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి పర్యవేక్షించారు. జిల్లాలోకి అనుమతులు ఉన్న వాహనాలనే అనుమతిస్తున్నారు. సర్కారు నిబంధనలు పక్కాగా పాటిస్తూ ప్రజలు ఇంటికే పరిమితం కావాలని సిపికోరారు.
లాక్‌డౌన్ నిబంధనల మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం 10 లోపు పోలీసులు దుకాణాలు మూసివేయించారు. 6 నుంచి 10 గంటల వరకు కూరగాయల మార్కెట్లు, నిత్యావసర దుకాణాలు సందడిగా కనిపించాయి. హైదరాబాద్-, విజయవాడ జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలను 10 గంటల తర్వాత కోదాడ రామాపురం చెక్ పోస్ట్ వద్ద వెనక్కు పంపించారు. లాక్‌డౌన్ తొలిరోజు యాదాద్రిలో నిర్ణీత సమయంలో మాత్రమే దర్శనాలకు అనుమతించారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్‌లో ఉదయం నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. కూరగాయలు, పండ్ల మార్కెట్ రద్దీగా కనిపించింది. 10 గంటల తరువాత పోలీసులు వ్యాపార సముదాయాలను మూసివేయించారు. సమయం ముగిసిన తరువాత ఎవరు దుకాణాలు తెరవొద్దని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
పెద్దపల్లి జిల్లా మంథనిలో ఉదయం నుంచే కూరగాయల మార్కెట్, కిరాణా సముదాయాలు, వస్త్ర సముదాయాలలో సందడి నెలకొంది. ఆర్‌టిసి బస్సుల తక్కువగా నడపడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని ఆలయ అధికారులు మూసివేశారు. లాక్‌డౌన్ దృష్ట్యా పది రోజులపాటు ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఇవొ కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో లాక్‌డౌన్ పటిష్టంగా అమలవుతోంది. ఉదయం పది తర్వాత రోడ్లపై వాహనాల రాకపోకలను పోలీసులు నియంత్రించారు. అనవసరంగా రోడ్లపై వచ్చిన వారిని మందలించి తిరిగి పంపిస్తున్నారు. అకారణంగా రోడ్లపైకి వస్తే రేపటి నుంచి కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
ప్రధాన రహదారులు ఖాళీ: లాక్‌డౌన్ విధించడంతో నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. పోలీసులు ప్రధాన రహదారులపై తనిఖీ నిర్వహించారు. సరైన కారణాలు లేకుండా బయట తిరుగుతున్న వారికి జరిమానాలు విధించారు. పోలీసులు ముమ్మర చర్యలతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి.లాక్‌డౌన్ పక్కాగావరంగల్ జిల్లాలోఉదయమే కూరగాయల మార్కెట్ల వద్ద ప్రజల రద్దీ నెలకొంది. పదిగంటల సమయం నుంచి లాక్ డౌన్ లో భాగంగా పోలీసులు కూడళ్ల వద్ద తనిఖీలు చేపట్టారు. తొలిరోజు కావడంతో పోలీసులు వాహనదారులకు అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. నిబంధనలను అతిక్రమించినవారిపై పలు చోట్ల కేసులు నమోదు చేశారు. హన్మకొండ, వరంగల్ బస్టాండ్లు ప్రయాణీకులు లేక బోసిపోయాయి. వ్యాక్సిన్ కోసం వెళ్లేవారిని.. అత్యవసర సేవల సిబ్బందిని పోలీసులు అనుమతించారు. జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ లాక్‌డౌన్ పక్కాగా అమలు చేశారు.
10 రోజులు రిజిస్ట్రేషన్లు బంద్
రాష్ట్రంలో లాక్‌డౌన్ కారణంగా పది రోజుల పాటు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే స్లాట్‌బుక్ చేసుకున్నవారికి రీ షెడ్యూల్ అవకాశం కల్పిస్తామని చెప్పారు. లాక్‌డౌన్ అనంతరం వీటిపై మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు. ప్రజలెవరూ తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లకు రావొద్దని సూచించారు.