Friday, November 22, 2024

మళ్లీ రగిలిన చిచ్చు

- Advertisement -
- Advertisement -

Israeli-Palestinian conflicts

 

ఇజ్రాయెల్ పాలస్తీనా ఘర్షణలు సంభవించినప్పుడల్లా పాలస్తీనియన్ మిలిటెంట్లు అరాచక రాకెట్ ప్రయోగానికి తెగించినందునే వైమానిక దాడులకు ఇజ్రాయెల్ పాల్పడవలసి వచ్చిందని ప్రపంచ మీడియా ప్రచారం చేస్తుంది. ఇజ్రాయెల్ ఆక్రమణలోని తూర్పు జెరూసలెం (పాతబస్తీ) లో గల అల్ అక్సా మసీదుపై దాని సాయుధ దళాలు మొన్న సోమవారం నాడు దాడి చేసినందునే ప్రస్తుత ఘర్షణలు హద్దులు మీరి చెలరేగాయి. మే 10న మితవాద యూదులు జరుపుకొనే జెరూసలెం దినాన (1967 జూన్‌లో 6 రోజుల యుద్ధం చివరి దినాన జోర్డాన్ నది పశ్చిమ తీరం వెస్ట్ బ్యాంకు, తూర్పు జెరూసలెం, గాజా, గోలాన్ కొండలు, సినాయ్ ద్వీపకల్పాలను ఇజ్రాయెల్ సేనలు ఆక్రమించుకున్నాయి. దానితో అప్పటి వరకు రెండుగా ఉన్న జెరూసలెం మొత్తంగా ఇజ్రాయెల్ అదుపులోకి వచ్చినట్టయింది. ఆ సందర్భాన్ని కరడుగట్టిన యూదు మితవాదులు ప్రతి యేటా మే 10న జెరూసలెం దినంగా జరుపుకుంటారు) ఆ రోజు ఊరేగింపు అల్ అక్సా మసీదు గుండా సాగుతుంది.

ఆ మసీదులో పాలస్తీనియన్ మిలిటెంట్లు రాళ్లు, కర్రలతో కాచుకొని ఉన్నారన్న అనుమానంతో ఇజ్రాయలీ దళాలు దానిపై దాడులు చేశాయి. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణల్లో 300 మందికి పైగా పాలస్తీనియన్లు గాయపడ్డారు. గాజా ప్రాంతాన్ని పాలిస్తున్న ఇస్లామిక్ పోరాట సంస్థ హమాస్‌కు చెందిన మిలిటెంట్లు జరిపిన ప్రతీకార రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్‌లోని ఇద్దరు చనిపోయారు. దానితో పగబట్టిన ఇజ్రాయెల్ సేనలు, పాలస్తీనా భూభాగమైన గాజా మీద వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. అందులో 54 మంది పాలస్తీనియన్లు దుర్మరణం చెందారు. వారిలో 14 మంది పిల్లలు కాగా మిగతా వారు హమాస్ మిలిటెంట్లు. రంజాన్ సందర్భంగా ముస్లింలు వచ్చి గుమికూడకుండా చూడడానికి జెరూసలెం పాత నగరం బయట ఇజ్రాయెలీ పోలీసులు అడ్డుగోడలు, అవరోధాలు ఏర్పాటు చేశారు. దాని వల్ల కూడా ఘర్షణలు చెలరేగాయి.

ఈ సందర్భంగా ఈ నెల 7వ తేదీ రాత్రి సంభవించిన పరస్పర దాడుల్లో వందల మంది పాతబస్తీ పాలస్తీనియన్లు, ఓ డజను మంది పోలీసులు గాయపడ్డారు. ఇలా రెండు వేర్వేరు సందర్భాల్లో ఇజ్రాయెలీ బలగాలు దూకుడుగా ప్రవర్తించినందునే ప్రస్తుత ఘర్షణలు చోటు చేసుకొని యుద్ధ స్థాయికి ఉద్ధృత మవుతున్నట్టు స్పష్టపడుతున్నది. రాజకీయంగా చూస్తే ఈ ఘర్షణలు పెరగడం పాలస్తీనా భూభాగాలన్నిటి మీదా పట్టుకోరుకుంటున్న హమాస్‌కు , అస్థిరత్వాన్ని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు కూడా మేలేనని తెలుస్తున్నది. ఏడేళ్ల అనంతరం ఇంత పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చోసుకోడం ఇదే మొదటిసారి. ఈ సారి ఇవి పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమించడం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు. వెస్ట్ బ్యాంకు మీద ఆధిపత్యాన్ని కోరుకుంటున్న హమాస్ అక్కడి పాలస్తీనా అథారిటీని ఏలుతున్న ఫతాతో తలపడుతున్నది.

జెరూసలెం పాత నగరంలోని పాలస్తీనియన్లు రెండవ తరగతి పౌరులుగా బతుకుతున్నారు. అక్కడి ఇజ్రాయెలీలు పూర్తి సగౌరవ పౌరసత్వాన్ని, హక్కులను అనుభవిస్తుండగా పాలస్తీనీయులు మాత్రం షరతులతో కూడిన ఉనికికి మాత్రమే అర్హులుగా దయనీయ స్థితిలో బతుకున్నారు. 1948లో పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్‌ను సృష్టించినప్పుడు అక్కడి నుంచి కొన్ని పాలస్తీనా కుటుంబాలను పాత జెరూసలెంలోని షేక్ జర్రా ప్రాంతానికి తరలించారు. అప్పుడు అక్కడ ఆ ప్రాంతాన్ని పాలిస్తూ వచ్చిన జోర్డాన్, ఐక్యరాజ్య సమితి సహాయ కార్యక్రమాల సంస్థ కలిసి వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చాయి. 1885 లో తాము అక్కడికి వచ్చి స్థిరపడాలనుకొని కొనుక్కున్న స్థలాలపై ఆ ఇళ్లు కట్టి ఇచ్చారన్న వాదనతో కొందరు యూదులు వారిని అక్కడి నుంచి తరిమేయాలని చిరకాలంగా డిమాండ్ చేస్తున్నారు. షేక్ జర్రాలోని నాలుగు పాలస్తీనా కుటుంబాలను ఖాళీ చేయించాలని తూర్పు జెరూసలెం సెంట్రల్ కోర్టు కొద్ది మాసాల క్రితం తీర్పు ఇచ్చింది. ఇలా పలు రకాలుగా అణచివేతకు గురి అవుతున్న పాత జెరూసలెంలోని పాలస్తీనియన్ల తరపున పోరాడడం ద్వారా హమాస్ వెస్ట్‌బ్యాంకులోని ప్రజల అభిమానాన్ని సాధించుకోవాలనుకుంటున్నది. అందుకు తగిన అవకాశాన్ని ఇజ్రాయెలీ దళాలు ఇప్పుడు కల్పించాయి.

అటు ఇటూ రాజకీయ అవసరాలు ఈ ఘర్షణ విస్తృతికి దోహదం చేస్తున్నాయి. దీనిపై భద్రతా మండలి సమావేశమవుతుందంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయిల్‌ను గట్టిగా సమర్థిస్తూ ఈ ఘర్షణలు త్వరలో చల్లారిపోతాయని కపట శాంతి వచనాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. చిరకాలంగా పాలస్తీనా భూభాగాలలోకి లక్షలాది మంది తన పౌరులను పంపించి ఆక్రమణలు ప్రోత్సహిస్తున్న ఇజ్రాయెల్‌ను అమెరికా అదుపు చేయనంత వరకు పరిస్థితిలో మార్పు రాదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News