Monday, November 18, 2024

ఇజ్రాయెల్ భీకర దాడులతో…. గాజా విడిచి పారిపోతున్న పాలెస్తీనీయన్లు

- Advertisement -
- Advertisement -

భూతల యుద్ధందిశగా మోహరింపులు
126కు చేరిన మృతుల సంఖ్య


గాజా: ఇజ్రాయెల్ సైన్యం పెద్ద ఎత్తున ప్రతీకార దాడులకు దిగడంతో పాలెస్తీనీయన్లు వణికిపోతున్నారు. గాజా నగర ప్రజలు సామాన్లు సర్దేసుకొని, చిన్నారులను వెంటబెట్టుకొని పొరుగున ఉన్న సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. శుక్రవారం పలు కుటుంబాలు నగర శివారున ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన పాఠశాలలకు చేరుకున్నాయి. కొందరు గాడిదలు,ట్రక్కులలో బయలుదేరగా, మరికొందరు కాలినడకనే అక్కడికి చేరుకున్నారు. సోమవారం నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. గాజాలోని హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ నగరాలపైకి రాకెట్లతో విరుచుకుపడగా, అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ట్యాంకులు, యుద్ధ విమానాలతో భీకర దాడులకు పాల్పడింది. ఈ పరస్పర దాడుల్లో మృతుల సంఖ్య 126కు చేరుకున్నది. ఇప్పటికే హమాస్ కీలక స్థావరాలను ధ్వంసం చేసినట్టుగా భావిస్తున్న ఇజ్రాయెల్ భూతల యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆరా తీశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడినట్టు బైడెన్ ప్రకటించారు. ఆ ప్రాంతంలో జరిగే ఘర్షణల్లో ఇజ్రాయెల్‌కు మొదటి నుంచీ అమెరికా అండగా నిలుస్తోంది. ఆపరేషన్ కొనసాగుతుందని, హమాస్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని నెతన్యాహు హెచ్చరించారు.

ఇప్పటివరకు ఇజ్రాయెల్‌పైకి హమాస్ దాదాపు 1800 రాకెట్లు ప్రయోగించింది. ఇజ్రాయెల్‌కు ఐరన్‌డోమ్ పేరుతో ఏర్పాటు చేసిన గగనతల రక్షణ వ్యవస్థ ఉండటంతో కొన్ని రాకెట్లయినా లక్షాన్ని చేరుకునేలా ఒక్కసారిగా వందలాది రాకెట్లతో హమాస్ తెగబడుతోంది. వాటిలో దాదాపు 400 రాకెట్లు పాలస్తీనా భూభాగంలోనే పడిపోగా, ఇజ్రాయెల్ నగరాలవైపు దూసుకువెళ్లిన రాకెట్లలో చాలా వరకు కూల్చివేతకు గురయ్యాయి. దాంతో, ఇజ్రాయెల్‌కు జరిగిన నష్టం స్వల్పమేనన్నది గమనార్హం. ఇజ్రాయెల్‌లో ఇప్పటి వరకు ఏడుగురు చనిపోగా, వారిలో ఒకరు సైనికుడు, మరొకరు ఆరేళ్లబాలుడున్నారు.

మరోవైపు గాజాపై ఇప్పటివరకు 600 వైమానిక దాడులు జరిగాయి. దాడుల్లో 119మంది చనిపోయారని, వారిలో 31మంది చిన్నారులు,19మంది మహిళలని గాజా ఆరోగ్యమంత్రి తెలిపారు. 830మంది గాయపడ్డారని తెలిపారు. మృతుల్లో 20 మంది వరకు హమాస్, ఇతర ఇస్లామిక్ గ్రూప్‌లవారున్నారని తెలిపారు. అయితే, చనిపోయిన తీవ్రవాదుల సంఖ్య ఇంకా అధికంగా ఉన్నదని ఇజ్రాయెల్ చెబుతోంది. తీవ్రవాదుల స్థావరాలే లక్షంగా
దాడులు జరుపుతున్నట్టు ఇజ్రాయెల్ చెబుతోంది.

భూతల యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా సంకేతాలందుతున్నాయి. ఇప్పటికే పాలెస్తీనా సరిహద్దున ఇజ్రాయెల్ 9000 రిజర్వ్ సైన్యాన్ని మోహరించింది. భూతల యుద్ధానికి తాము భయపడటంలేదని హమాస్ అధికార ప్రతినిధి అబూ ఒబీడా తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యాన్ని పెద్ద సంఖ్యలో పట్టుకోవడానికి అది తమకో అవకాశమని కూడా ఆయన అన్నారు. ఓవైపు ఇరు దేశాల మధ్య మిలిటరీ దాడులు జరుగుతుండగా, మరోవైపు ఇజ్రాయెల్‌లోని జెరూసలేం, టెల్‌అవీవ్, లాడ్‌లాంటి నగరాల్లో మత ఘర్షనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణలకు సంబంధించి 750మంది అనుమానితులను అరెస్ట్ చేసినట్టు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. యూదులు మెజార్టీగా ఉన్న ఇజ్రాయెల్‌లో ముస్లింలు మైనార్టీలన్నది గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News