Saturday, November 23, 2024

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో.. సొరంగాలు, 9 భవనాలు ధ్వంసం

- Advertisement -
- Advertisement -

Israel says Gaza tunnels and 9 buildings destroyed in heavy airstrike

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో..
సొరంగాలు, 9 భవనాలు ధ్వంసం
హమాస్ స్థావరాలే లక్షంగా భీకర దాడులు

గాజా: గాజాపై వైమానిక దాడుల్ని ఇజ్రాయెల్ ఉధృతం చేసింది. సోమవారం ఉదయం గాజా నగరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగాయి. హమాస్ కమాండర్ల స్థావరాలుగా భావిస్తున్న భూగర్భ సొరంగాలు, 9 నివాస భవనాలు లక్షంగా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. 15 కిలోమీటర్లమేర మిలిటెంట్ల సొరంగాలను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. వారం రోజుల క్రితం ప్రారంభించిన దాడుల్లో ఇవే భీకరమైనవని స్థానికులు తెలిపారు. ప్రాణ నష్టం గురించి ఇంకా వివరాలందలేదు. అయితే, హమాస్‌కు చెందిన కీలక నేతలే లక్షంగా దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ చెబుతోంది.

సోమవారం వైమానిక దాడులతోపాటు గాజాపై శతఘ్నులను కూడా ఇజ్రాయెల్ ప్రయోగించింది. ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో గాజాలో మూడు భవనాలు ధ్వంసం కాగా, 42మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు గాజాలో కనీసం 198మంది పాలస్టీనీయన్లు చనిపోగా, వారిలో 58మంది చిన్నారులు, 35మంది మహిళలున్నారని, మరో 1300మంది గాయపడ్డారని గాజా ఆరోగ్యశాఖమంత్రి తెలిపారు. హమాస్ దాడుల వల్ల ఇజ్రాయెల్‌లో 8మంది చనిపోగా, వారిలో ఒకరు సైనికుడు, మరొకరు ఐదేళ్ల బాలుడు.

పంతాలు, పట్టింపుల మధ్య ఇజ్రాయెల్, పాలస్తీనా గ్రూప్ హమాస్ మధ్య 8 రోజులుగా దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. 2014 తర్వాత ఇంతటి యుద్ధ పరిస్థితిని చూడలేదని గాజాలోని రెస్క్యూ అధికారి ఒకరు తెలిపారు. హమాస్ తీవ్రవాదులే లక్షంగా వైమానిక దాడులు జరుపుతున్నట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే, ఈ దాడుల్లో తమ గ్రూప్‌నకు చెందిన 20మంది మాత్రమే చనిపోయారని హమాస్ అంటోంది. ఆ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నదని, రెండు డజన్లకుపైగా ఫోటోలు, పేర్లను ఇజ్రాయెల్ వెల్లడించింది.

హమాస్‌ను చావుదెబ్బ తీసే లక్షంతోనే దాడుల్ని ఉధృతం చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. మరోవైపు కాల్పుల విరమణ కోసం అమెరికా, రష్యా, ఈజిప్టు, ఖతార్‌తో చర్చలు జరుపుతున్నట్టు హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనీయే తెలిపారు. పాలస్తీనీయన్ల త్యాగాలకు విలువ ఇచ్చినపుడే సామరస్య పరిష్కారానికి అంగీకరిస్తామని లెబనీస్ దినపత్రిక అల్‌అక్బర్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన అన్నారు. హమాస్ కార్యకలాపాలను ఇస్మాయిల్ విదేశాలలో ఉంటూ పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News