ప్రధాని మోడీ తరఫున తొలి పూజ
డెహ్రాడూన్: ఆరు నెలల శీతాకాల విరామం అనంతరం కేదార్‌నాథ్ ఆలయ పోర్టల్స్ సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ తరఫున తొలి పూజను ఆలయ పూజారులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కొవిడ్-19 సెకండ్ వేవ్ దృష్టిలో ఉంచుకుని ఆలయ పునఃప్రారంభ కార్యక్రమానికి అతి స్వల్ప సంఖ్యలో అధికారులు, పూజారులు హాజరయ్యారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా హిమాలయ పర్వతాలలో కొలువై ఉన్న కేదార్‌నాథ్ ఆలయానికి భక్తుల రాక పూర్తిగా తగ్గిపోవడం వరుసగా ఇది రెండవ సంవత్సరం. తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరుచుకోగా ప్రధాని మోడీ తరఫున ఆలయ పూజారులు తొలి పూజను నిర్వహించినట్లు చార్‌ధామ్ దేవస్థానం బోర్డు అధికారి తెలిపారు.
ఆలయ ప్రధాన పూజారి, కొద్ది మంది పూజారులు, ప్రభుత్వ, దేవస్థానం బోర్డు అధికారులు మాత్రమే తొలి పూజకు హాజరయ్యారు. కేదార్‌నాథ్ ఆలయ పునఃప్రారంభంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థ సింగ్ రావత్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల యోగక్షేమాల కోసం ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల క్షేమం కోసమే ఆలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. భక్తులు వర్చువల్ పద్ధతిలో బాబా కేదార్‌ను దర్శించుకుని ఇళ్లలోనే పూజలు చేసుకోవాలని ఆయన సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టగానే చార్‌ధామ్ యాత్ర ప్రారంభమవుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహరాజ్ తెలిపారు. మే 14న యమునోత్రి, మే 15న గంగోత్రి ఆలయాలు తెరుచుకోగా బద్రీనాథ్ ఆలయం మంగళవారం నిత పూజల కోసం తెరుచుకోనున్నది. అయితే ఈ ఆలయాలలో భక్తులకు ప్రవేశం మాత్రం కల్పించడం లేదు.