గాజా: గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు మంగళవారం కూడా కొనసాగాయి. ఇజ్రాయెల్ దాడిలో గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీకి చెందిన ఆరంతస్థుల భవనం కుప్పకూలింది. ఆ భవనంలోని లైబ్రరీకి సంబంధించిన పుస్తకాలు, కంప్యూటర్లు, డెస్క్‌లు, కుర్చీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రాణ నష్టం గురించి సమాచారమందాల్సి ఉన్నది. అక్కడ నివాస ముంటున్నవారు ప్రాణభయంతో పరుగుపెట్టారు. ఇజ్రాయెల్ మాత్రం హమాస్ మిలిటెంట్లే లక్షంగా దాడులు జరుపుతున్నామని పునరుద్ఘాటించింది. హమాస్ కూడా డజన్లకొద్దీ రాకెట్లను ఇజ్రాయెల్‌వైపు ప్రయోగించింది. మరోవైపు ఆ ప్రాంతంలోని పాలస్తీనీయన్లు మంగళవారం నిరసన పాటించారు.
ఇజ్రాయెల్ ఆక్రమిత జెరూసలేం, వెస్ట్‌బ్యాంక్‌లోనూ నిరసనలు జరిగాయి. వెస్ట్‌బ్యాంక్‌లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఇజ్రాయెల్‌లో 20 శాతం వరకూ పాలస్తీనీయన్లు ఉన్నారు. మానవ హక్కుల సంఘాలు పాలస్తీనీయన్లకు మద్దతు తెలిపాయి. ఇజ్రాయెల్‌ది ఏకపక్ష జాత్యహంకార దాడిగా వారు విమర్శించారు. ప్రస్తుత పరిస్థితికి హమాసే కారణమని ఇజ్రాయెల్ అంటోంది. గత వారం రోజులుగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 212మంది పాలస్తీనీయన్లు చనిపోయారని, వారిలో 61మంది చిన్నారులు, 36మంది మహిళలున్నారని, మరో 1400మంది గాయపడ్డారని గాజా ఆరోగ్యమంత్రి తెలిపారు. హమాస్ రాకెట్ దాడుల వల్ల ఇజ్రాయెల్‌లో పదిమంది చనిపోయారు.
Islamic University Library destroyed in Gaza