హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం సందర్శించారు. కరోనా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కరోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను సిఎం పరామర్శించి, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఒపి విభాగంలో కొవిడ్-19 వైద్య సేవలను పరిశీలించారు. కొవిడ్ చికిత్స, సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు,వైద్యసిబ్బందిని ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందించారు. గాంధీ ఆస్పత్రిలో దాదాపు 40 నిమిషాలపాటు వైద్య సేవలను కెసిఆర్ పర్వవేక్షించారు. దవాఖానలో ఆక్సిజన్, ఔషధాల లభ్యత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.