డిసెంబర్ 8 నుంచి తొలి టెస్టు
సిడ్నీ : ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ సిరీస్‌కు ఎంతో ఆదరణ ఉంది. ఈసారి యాషెస్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం ప్రకటించింది. యాషెస్‌లో భాగంగా రెండు జట్ల మధ్య మొత్తం ఐదు టెస్టు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 8 నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా మొదటి టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఇక రెండో టెస్టుకు అడిలైడ్ వేదికగా నిలువనుంది. డిసెంబర్ 16న ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ టెస్టు మ్యాచ్ డేనైట్ ఫార్మాట్‌లో నిర్వహిస్తారు. డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్‌లో మూడో టెస్టు నిర్వహించనున్నారు.
బాక్సింగ్‌డే టెస్టుగా పరిగణించే ఈ టెస్టు కు చారిత్రక మెల్‌బోర్న్ గ్రౌండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక జనవరి ఐదు నుంచి సిడ్నీలో నాలుగో టెస్టు మ్యాచ్ జరుగనుంది. మరోవైపు ఐదో చివరి టెస్టు మ్యాచ్ పెర్త్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ జనవరి 14న ప్రారంభం అవుతుంది. సుదీర్ఘ కాలం పాటు జరిగే సిరీస్‌కు అభిమానులకు అనుమతించే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియాలో కరోనా కేసులు తక్కువ ఉండడంతో ప్రేక్షకుల మధ్య సిరీస్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. చిరకాల ప్రత్యర్థులుగా పేరు తెచ్చుకున్న ఇంగ్లండ్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య క్రమం తప్పకుండా యాషెస్ సిరీస్‌ను నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. భారత్‌పాకిస్థాన్‌ల సిరీస్‌ల మాదిరిగానే యాషెస్‌కు కూడా విపరీత ఆదరణ లభిస్తుంది. ఇరు జట్ల క్రికెటర్లు ఈ సిరీస్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. దీంతో యాషెస్ సమరం ఆసక్తికరంగా సాగుతోంది.
మహిళల యాషెస్ కూడా..
మరోవైపు వచ్చే ఏడాది జనవరిలో మహిళల యాషెస్ సిరీస్ కూడా జరుగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓ టెస్టు మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. 2022 జనవరి 27 నుంచి మనుకా ఓవల్ మైదానంలో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ జరుగనుంది. అనంతరం రెండు జట్ల మధ్య మూడు వన్డేలు, మరో మూడు ట్వంటీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇదిలావుండగా పురుషుల యాషెస్ సిరీస్‌కు ముందు అఫ్గానిస్తాన్ ఓ టెస్టు మ్యాచ్‌ను నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది. అఫ్గాన్‌తో సొంత గడ్డపై ఆస్ట్రేలియాకు ఇదే తొలి సిరీస్ కావడం విశేషం.