మైక్రోసాఫ్ట్ ప్రకటన
వాషింగ్టన్: నెటిజన్లకు 25 ఏళ్లకు పైగా సేవలందచేసిన తన బ్రౌజర్ ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ వచ్చే ఏడాది జూన్ 15 నుంచి నిష్క్రమిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. విండోస్ 95తో విడుదలైన ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ పాతికేళ్లకు పైగా నెటిజన్లకు సేవలందచేసిందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ బుధవారం తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ 11 డెస్క్‌టాప్ అప్లికేషన్, విండోస్ 10కు చెందిన కొన్ని వెర్షన్లు 2022 జూన్ 15 నుంచి నిష్క్రమించనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ప్రోగ్రామ్ మేనేజర్ సీన్ లిండర్‌సే పేర్కొన్నారు. ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ భవిష్యత్తులో విండోస్ 10పై మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో అందుబాటులో ఉంటుందని, ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ కన్నా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ మరింత వేగంగా, భద్రంగా, అధునాతన బ్రౌసింగ్ అనుభవాన్ని కలిగిస్తుందని, ఇతర పాత, వారసత్వ వెబ్‌సైట్లకు, అప్లికేషన్లకు ఇది అనుకూలంగా ఉంటుందని ఆయన వివరించారు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ మోడ్ 2029 వరకు పనిచేస్తుందని తెలిపారు.