Sunday, November 24, 2024

మరో ‘టూల్ కిట్’!

- Advertisement -
- Advertisement -

Tweet war between Congress and BJP

 

ప్రధాని మోడీని, ఆయన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచార వ్యూహా (టూల్ కిట్) వ్యూహాన్ని చేపట్టిందంటూ భారతీయ జనతా పార్టీ పెద్దలు కొందరు పెట్టిన ట్వీట్లు తప్పుడివని, అబద్ధాలూ వక్రీకరణలని ట్విట్టర్ పేర్కొనడం పై కేంద్ర ఎలెక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ అగ్గిమీద గుగ్గిలమైంది. ఈ అభిప్రాయాన్ని వెంటనే తొలగించాలని ట్విట్టర్ యాజమాన్యాన్ని కోరింది. కాంగ్రెస్ టూల్ కిట్ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్న సమయంలో ట్విట్టర్ ఇలా వ్యాఖ్యానించడం తగదని అది కేసు విచారణను తప్పుదోవ పట్టిస్తుందని అభ్యంతరం చెప్పింది. సంపన్న దేశాల్లో ఉనికి, అంతర్జాతీయ వ్యాప్తి గల ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలు తమ వేదికలపై పెట్టే పోస్టింగులు దురుద్దేశంతో కూడినవని భావిస్తే వాటిని తొలగించడమో లేదా వాటిని ఎండగడుతూ తమ అభిప్రాయాన్ని ప్రకటించడమో చేస్తాయి. ఆ విధంగా ఆ పోస్టింగులు కలిగించబోయే దుష్ప్రభావాన్ని పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తాయి.

కొవిడ్ 19 సెకండ్ వేవ్‌తో పోరాటంలో ప్రధాని మోడీ ప్రభుత్వం కృషిని తక్కువ చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ టూల్ కిట్‌ను ప్రయోగించిందని తాజా కొవిడ్ మ్యూటెంట్‌ను భారతీయ మ్యూటెంట్ లేదా మోడీ మ్యూటెం ట్ అని ప్రచారం చేస్తున్నదని బిజెపి నేతలు ట్వీట్లు పెట్టడం పట్ల ఆ పార్టీ ట్విట్టర్‌కు ఫిర్యాదు చేసింది. దానిపై బిజెపి జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రా, ఎంపి విజయ్ సహస్ర బుద్ధే ఆ పార్టీ జాతీయ సామాజిక మాధ్యమ ఇన్‌చార్జి ప్రీతి గాంధీ తదితర ఏడుగురి ట్వీట్లను ట్విట్టర్ యాజమాన్యం పరిశీలించింది. వాటిని మేనిప్యులేటెడ్ మీడియా (వక్రీకరించిన ప్రచారాంశాలు) గా వర్గీకరించింది. దీనిపై కేంద్ర ఐటి శాఖ ఆగ్రహం ప్రకటించింది. కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీల మధ్య వ్యవహారాన్ని ప్రభుత్వం తన మీద వేసుకొని ఒక పక్షం వహించడం గమనించవలసిన విషయం. మోడీ ప్రభుత్వానికి ట్విట్టర్‌కు లడాయి ఇది మొదటి సారి కాదు. గత ఫిబ్రవరిలో ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం తీవ్ర రూపం ధరించినప్పుడు ఉద్యమకారులకు అనుకూలమైన ప్రచారానికి ట్విట్టర్ ప్రాధాన్యమివ్వడాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం తప్పు పట్టింది.

భావ ప్రకటన స్వేచ్ఛకు మద్దతు ఇవ్వడానికి బదులు ట్విట్టర్ దానిని దుర్వినియోగం చేస్తున్నదని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారి తరపున పని చేస్తున్నదని అభిప్రాయపడింది. అమెరికన్ పార్లమెంటు భవనం కేపిటల్ హిల్‌లోకి జొరబడి హింసాత్మక ఆందోళనకు దిగిన వారి విషయంలో ఒక విధంగానూ, భారతీయ రైతు నిరసనకారుల సందర్భంలో మరో రకంగానూ ట్విట్టర్ వ్యవహరించిందని ఆరోపించింది. రైతు ఉద్యమంపై ‘రైతుల ఊచకోత’ అనే శీర్షికన అభిప్రాయాలు ప్రకటించినందుకు అభ్యంతరం తెలిపింది. ‘భారత దేశంలో వ్యాపారం చేసుకోండి కాని ఇక్కడి పార్లమెంటు చేసిన చట్టాలను ఉల్లంఘించకండి’ అంటూ ఘాటుగా స్పందించింది. ఇప్పుడు కాంగ్రెస్ టూల్ కిట్‌గా పేర్కొంటూ బిజెపి నేతులు పెడుతున్న ట్వీట్లను తప్పుడివని ట్విట్టర్ అభిప్రాయపడడం పట్ల ప్రభుత్వానికి ఆగ్రహం కలగడం విస్తుపోవలసిన విషయం కాదు. అసలే ప్రశ్నను భరించలేని అసహనానికి ప్రతీకలుగా మన పాలకులు వెలిగిపోతున్నారు.

తమ ప్రచారాంశాలు దురుద్దేశంతో కూడినవని ఒక ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక స్వయంగా ముద్ర వేస్తే అది ప్రతిపక్షం చేతి ఆయుధమై తమ బంఢారాన్ని బయటపెడుతుందనే బాధ పీడిస్తుంది కదా. రైతు ఉద్యమానికి మద్దతుగా స్వీడిష్ పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి గ్రేటా థమ్‌బర్గ్‌తో కలిసి టూల్ కిట్‌ను రూపొందించారని, ఖలిస్థాన్ ఉద్యమకారులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ గత ఫిబ్రవరిలో బెంగళూరుకి చెందిన 22 ఏళ్ల అమ్మాయి దిశ రవిని ఢిల్లీ పోలీసులు ఆమె ఇంటి వద్ద నుంచి తీసుకుపోయి అరెస్టు చేసిన ఉదంతం తెలిసిందే. తమ పార్టీకి 32 లక్షల మంది సునిశుతులైన సైబర్ ప్రచారకుల బృందం ఉందని, వారు తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేసి ప్రచారంలో పెట్టగలరని, ఎంతటి అబద్ధాన్నైనా నిజమని నమ్మించగల సామర్థం గలవారని, 2018 సెప్టెంబర్‌లో అప్పుడు బిజెపి జాతీయ అధ్యక్షుడుగా ఉన్న ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా సగర్వంగా ప్రకటించుకున్నారు. నిజమైనా, అబద్ధమైనా సంతోషకరమైనదైనా, బాధ కలిగించేదైనా ఏ సందేశాన్నైనా భారీ స్థాయిలో ప్రచారంలో పెట్టి దానిని నమ్మించగల సామర్థం తమకున్నదని రాజస్థాన్‌లోని కోటలో పార్టీ సామాజిక కార్యకర్తల సభనుద్దేశించి ఆయన అన్నారు.

అంతకు ఏడాది క్రితం ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల సమయంలో సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ తన తండ్రి, ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ను చాచి చెంప దెబ్బ కొట్టారన్న అబద్ధాన్ని ప్రచారంలో పెట్టి జనం నమ్మేలా చేసిన ఘనతను ఈ సందర్భంగా అమిత్ షా ఉదహరించారు. ఇప్పుడు బిజెపి నేతల ట్వీట్లను తప్పుపడుతూ ట్విట్టర్ చేసిన వ్యాఖ్యానం కమలనాథుల కపట రాజకీయాలను మరింతగా ప్రపంచం దృష్టికి తెచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News