రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఈ నెల 17న భద్రతా దళాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన కాల్పుల పోరులో ముగ్గురు గ్రామస్తులు మరణించగా పలువురు గాయపడిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది.
ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం సిల్గేర్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన పోలీసు క్యాంపును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టగా వారిని అడ్డుగా పెట్టుకుని నక్సలైట్లు ముందుగా పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పులు జరపగా మావోయిస్టుల అనుబంధ సంస్థలకు చెందిన ముగ్గురు సభ్యులు మరణించినట్లు అధికారులు గుర్తించారు.
అయితే గ్రామస్తులు మాత్రంం పోలీసుల కథనాన్ని తోసిపుచ్చారు. ఎటువంటి కవ్వింపు చర్యలు లేనప్పటికీ భద్రతా సిబ్బంది తమపై కాల్పులు జరిపారని, నక్సల్స్‌తో ఎటువంటి సంబంధం లేని ముగ్గురు గ్రామస్తులు ఈ కాల్పులలో మరణించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా.. సిల్గేర్ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తున్నట్లు సుక్మా కలెక్టర్ వినీత్ నందన్‌వార్ ఆదివారం రాత్రి ప్రకటించారు. డిప్యుటీ కలెక్టర్, ఎగ్జిక్యుటివ్ మెజిస్ట్రేట్ రూపేంద్ర పటేల్ విచారణాధికారిగా ఉంటారని, నెలరోజుల్లో ఆయన తన నివేదికను అందచేయాల్సి ఉంటుందని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.