ముంబై: త్వరలో న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సమరం టీమిండియాకు తేలికేం కాదు. ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ఈ ఫైనల్ పోరు భారత్‌కు సవాల్ వంటిదేనని చెప్పాలి. బౌన్స్‌కు అనుకూలించి ఇంగ్లండ్ పిచ్‌లపై కివీస్ బౌలర్లను ఎదుర్కొవడం టీమిండియాకు అంత సులువు కాదనే చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన బౌలర్లు కివీస్‌కు అందుబాటులో ఉన్నారు. ట్రెంట్ బౌల్ట్, మ్యాట్ హెన్రీ, వాగ్నర్, టిమ్ సౌథి వంటి అగ్రశ్రేణి బౌలర్లు జట్టులో ఉండడంతో న్యూజిలాండ్ బౌలింగ్ చాలా పటిష్టంగా మారింది. ప్రస్తుతం బౌల్ట్, వాగ్నర్, సౌథి తదితరులు ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ బౌలర్లుగా కొనసాగుతున్నారు. వీరి బౌలింగ్‌ను ఎదుర్కొని భారీ స్కోర్లు సాధించడం టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు సవాల్ వంటిదే. కిందటిసారి న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఫాస్ట్ పిచ్‌లపై కివీస్ ఎప్పుడూ కూడా ప్రమాదకర జట్టే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల కాలంలో వాగ్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. ప్రతి సిరీస్‌లోనూ వికెట్ల పంట పండిస్తున్నాడు. ఈసారి కూడా అతనితో టీమిండియాకు పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే వాగ్నర్‌పై కివీస్ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ ఫైనల్లో అతన్ని ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకునేందుకు కివీస్ వ్యూహాలు రచిస్తోంది. బౌల్ట్, జెమీసన్, సౌథి, హెన్రీలు కూడా సత్తా కలవారే. ఇటీవల జరిగిన ఐపిఎల్‌లో బౌల్ట్ అద్భుతంగా రాణించడం కివీస్‌కు శుభపరిణామంగా చెప్పొచ్చు. జెమీసన్ కూడా జోరుమీదున్నాడు. ఇక ఎప్పటిలాగే సౌథి ఈసారి కూడా కీలక పాత్ర పోషించనున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న సౌథి నుంచి టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు గట్టి ఎదురయ్యే అవకాశం ఉంది. బ్యాటింగ్‌తో పోల్చితే బౌలింగ్‌లో కివీస్ చాలా బలంగా కనిపిస్తోంది. ఇక భారత్‌తో తుది సమరానికి ముందు ఇంగ్లండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుండడం కూడా కివీస్‌కు సానుకూలంగా మారనుంది. ఇంగ్లండ్ పిచ్‌లపై ఓ అవగాహనకు వచ్చేందుకు ఈ సిరీస్ దోహదం చేయడం ఖాయం. ఇక కేన్ విలియమ్సన్ కెప్టెన్సీ కూడా కివీస్‌కు పెద్ద వరంగా మారనుంది. కొన్ని రోజులుగా కివీస్ సాధిస్తున్న విజయాల్లో విలియమ్సన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈసారి కూడా మెరుగైన కెప్టెన్సీతో జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు రాస్ టెలర్, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, గ్రాండోమ్, కాన్వే తదితరులతో కివీస్ బ్యాటింగ్ కూడా బలంగానే ఉంది. దీంతో డబ్లూటిసి ఫైనల్లో భారత్‌కు విలియమ్సన్ సేన నుంచి గట్టి పోటీ ఎదురుకావడం ఖాయమని చెప్పక తప్పదు.
కివీస్‌తో పోరు భారత్‌కు సవాల్ వంటిదే!
- Advertisement -
- Advertisement -
- Advertisement -