వృద్ధిమాన్ సాహా
ముంబై: టెస్టు జట్టులో స్థానం కోసం తాను చాలా ఏళ్ల పాటు ఎదురు చూడాల్సి వచ్చిందని టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృధ్ధిమాన్ సాహా అభిప్రాయపడ్డాడు. మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాతే తనకు టీమిండియాలో వరుసగా చోటు దక్కిందన్నాడు. ధోనీలాంటి సీనియర్ అందుబాటులో ఉన్న సమయంలో వికెట్ కీపర్ జట్టులో స్థానం పొందడం ఎవరికైనా చాలా కష్టమైన విషయమన్నాడు. తనకు కూడా ఇలాంటి పరిస్థితి తప్పలేదన్నాడు. అయితే ఈ విషయంలో ధోనీని తప్పుపట్టే ప్రసక్తేలేదన్నాడు. ధోనీలాంటి క్రికెటర్ చాలా అరుదుగా లభిస్తారన్నాడు. అతని స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టంతో కూడుకున్న అంశమని సాహా పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్ పర్యటన తనకు చాలా కీలకమన్నాడు. రిషబ్ పంత్‌తో తనకు ఆరోగ్యకరమైన పోటీ నెలకొందన్నాడు. ఒకవేళ ఛాన్స్ లభిస్తే మెరుగైన ఆటను కనబరిచేందుకు ప్రయత్నిస్తానని సాహా స్పష్టం చేశాడు.