ఐటి కొత్త నిబంధనలపై ట్విట్టర్ ఆందోళన
కల్పిత ట్యాగ్‌లపై పోలీసుల బెదిరింపులా ? అని విమర్శ
కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఐటి కొత్త నిబంధనలపై ట్విటర్ సంస్థ గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో ఉన్న చట్టాలకు లోబడి పని చేస్తామని, భారత ప్రభుత్వంతో నిరంతరం సమగ్ర చర్చలు జరుపుతామని వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా తాము అనుసరిస్తున్నట్టుగానే పారదర్శకతాసూత్రాల మార్గదర్శకత్వంలో కచ్చితంగా పని చేస్తామని స్పష్టం చేసింది. భావప్రకటన, స్వేచ్ఛ వ్యక్తిగత గోప్యత, పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటామని తెలియచేసింది. అయితే ఇటీవల గురుగ్రామ్ లో జరిగిన కొన్ని సంఘటనలు, తమ సంస్థ ఉద్యోగుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ టూల్‌కిట్‌పై బిజెపి నేతల పోస్టులకు టిట్టర్ ‘మానిప్యులేటెట్ మీడియా’ (కల్పిత మైన) అని ట్యాగ్ చేసింది. ఈ ట్యాగ్‌ను తొలగించాలని ప్రభుత్వం కోరింది. దీనిపై నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ, గురుగ్రామ్ లోని ట్విటర్ కార్యాలయాకు సోమవారం వెళ్లి ఉద్రిక్త వాతావరణం కల్పించారని, పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడాన్ని ట్విట్టర్ ఆక్షేపించింది.
అంతర్జాతీయ సేవా నిబంధనల అమలుకు ప్రతిస్పందనగా పోలీసులు బెదిరింపు వ్యూహాలను ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కొత్త నిబంధనల మౌలికాంశాల పై ప్రపంచ వ్యాప్తంగా, అదే విధంగా బారత దేశం లోని పౌర సమాజంలో చాలామందితోపాటు తమకు ఆందోళన ఉందని పేర్కొంది. ఈ నిబంధనల మార్పు కోసం వాదనలు వినిపించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్టు పేర్కొంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, భారత్‌లో కాంప్లియన్స్ ఆఫీసర్‌ను నియమించాలని కొత్త చట్టంలో నిబంధన విధించారు. సమస్యలను పరిష్కరించడానికి గ్రీవియన్స్ రెస్పాన్స్ వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలు ఇచ్చిన 36 గంటల్లో తమ ప్లాట్‌ఫామ్‌ల నుంచి సంబంధిత సమాచారాన్ని తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కొత్త నిబంధనలకు వాట్సాప్ వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇవన్నీ రాజ్యాంగ విరుద్దంగా ఉన్నాయని, వినియోగదారుల గోప్యతను ఉల్లంఘిస్తున్నట్టు ఆరోపించింది.
Twitter Concerned over India Intimidation Tactics