ప్రభుత్వంతో చర్చలు సఫలం
సీనియర్ రెసిడెంట్ వైద్యులకు 15శాతం స్టైఫండ్ పెంపు
కొవిడ్ సోకిన డాక్టర్లకు, కుటుంబసభ్యులకు నిమ్స్‌లో చికిత్స, ప్రత్యేక ఉత్తర్వులు జారీ
జనవరి 1 నుంచి అమల్లోకి
మన తెలంగాణ/హైదరాబాద్: ఎట్టకేలకు జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలమయ్యాయి. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు గురువారం హెల్త్ సెక్రటరీ రిజ్వీ జూడాలతో ప్రత్యేక చర్చలు జరిపారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి, ప్రజలకు సహకరించాలని కోరారు. అయితే ప్రభుత్వం ముందు జూడాలు మూడు డిమాండ్లు ఉంచగా, వాటిలో స్టైఫండ్ పెంపు, నిమ్స్‌లో ప్రత్యేక వైద్యానికి అంగీకరించారు. జూడాలు, రెసిడెండ్ల ట్రీట్మెంట్కు నోడల్ ఆఫీసర్‌గా ఓ రెసిడెంట్ డాక్టర్‌ను నియమిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఎక్స్‌గ్రేషియా అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని రిజ్వీ తెలిపినట్లు జూడాలు చెప్పారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి తాము విధులకు హజరవుతామని, ప్రజా రోగ్యం కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని జూడా స్టేట్ ప్రెసిడెంట్ డా నవీన్ తెలిపారు. ప్రస్తుతానికి అన్ని డిమాండ్లు నెరవేర్చకపోయినా సిఎం కెసిఆర్ నుంచి వచ్చిన సానుకూల స్పందనతో ఆందోళనలు విరమిస్తున్నట్లు ఆయన చెప్పారు.
15 శాతం పెంపు స్టైఫండ్‌పై జి.వో విడుదల…
ఇప్పటికే జూడాలకు 15 శాతం పెంపుపై ప్రత్యేక జి.వో విడుదల కాగా, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకూ 15 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు గురువారం హెల్త్ సెక్రటరీ రిజ్వీ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని తెలిపారు. దీంతో సీనియర్ రెసిండెట్లకు ప్రస్తుతం ఉన్న రూ. 70 వేల నుంచి రూ.80,500లకు గౌరవ వేతనం పెరగనుంది. రిజ్వీతో జరిగిన చర్చల్లో ఉస్మానియా జూడా ప్రెసిండెట్ డాక్టర్ రాహుల్, జనరల్ సెక్రటరీ, డాక్టర్ సాగర్, డాక్టర్ లక్షీ, డాక్టర్ శ్రీకాంత్, గాంధీ జూడా ప్రెసిడెంట్ మణికిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విపత్కర పరిస్థితుల్లో సమ్మెలు చేయడం సరికాదుః ఉస్మానియా ప్రభుత్వ వైద్యుల సంఘం
కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో సమ్మెలు చేయడం సరికాదని ఉస్మానియా ప్రభుత్వ వైద్యుల సంఘం తెలిపింది. వైరస్ భయంతో ఎంతో మంది పేద ప్రజలు చనిపోతుంటే జూడాలు ఇలాంటి సమయంలో నిర్లక్షంగా వ్యవహరించడం కరెక్ట్ కాదన్నారు. ఇక నుంచి ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రభుత్వం, కోర్టులు జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రెసిడెంట్ డా పల్లం ప్రవీణ్, సభ్యులు డా శేఖర్, రఘు కోరారు.
Junior Doctors Stop Strike with KCR Appeals