64 ఆసుపత్రులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు
కొవిడ్ చికిత్సకు సర్కార్ సూచించిన ధరల కన్నా అదనంగా వసూలు చేస్తే కఠిన చర్యలు
ఫిర్యాదులకు 915417960 వాట్సాప్ నెంబర్‌ను సంప్రదించాలి
బ్లాక్ ఫంగస్‌కు ప్రభుత్వమే మందులు అందజేస్తుంది
1500 బెడ్లు సమకూర్చాం, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు
కొత్త పాజిటివ్‌ల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది
93శాతానికి రికవరీ రేటు
కరోనా నియంత్రణకు ఇంటింటి జ్వర సర్వే ఎంతో ఉపయుక్తం:హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాసరావు
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా చికిత్సను అందిస్తున్న 64 ప్రైవేట్ ఆసుపత్రులపై 88 ఫిర్యాదులు వచ్చాయని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు డా జి శ్రీనివాసరావు తెలిపారు. వీటిలో హైదరాబాద్‌లో 39, మేడ్చల్‌లో 22, రంగారెడ్డిలో 15, వరంగల్ అర్బన్‌లో 7, సంగారెడ్డి 2, మహబూబ్‌నగర్ 1, నిజామాబాద్ 1 యాదాద్రి జిల్లా నుంచి మరోక ఫిర్యాదు వచ్చిందన్నారు. అయితే గరిష్ఠంగా హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ ఆసుపత్రిపై ఏకంగా ఆరు ఫిర్యాదులు రాగా, మిగతా ఆసుపత్రులన్నింటికి కనీసం రెండు ఫిర్యాదులు చొప్పున వచ్చినట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే ఆయా ఆసుపత్రులన్నింటికీ షోకాజ్ నోటీసులు ఇచ్చామని, వారంతా 24 గంటల నుంచి 48 గంటల్లో వివరణ ఇవ్వాలని డిహెచ్ సూచించారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం సదరు హాస్పిటల్స్‌పై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కొవిడ్ చికిత్స పర్మీషన్లు కూడా రద్ధు చేస్తామన్నారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా అధిక బిల్లులు, మందుల దోపిడి, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకపోవడం, బెడ్లను సరైన సమయానికి ఇవ్వకపోవడంపైనే ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రకటించిన జి.ఓ 248 ప్రకారం కంటే ఎక్కువ ధరలు తీసుకుంటున్న ఆసుపత్రులపై తమ టాస్క్ ఫోర్స్ కమిటీ నిఘా పెట్టిందని, అతి త్వరలో వాటిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానవతా దృక్పధంతో చికిత్స నిర్వహించాలన్నారు. ప్రైవేట్ దోపిడిపై సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు వైద్యశాఖ చాలా సీరియస్ యాక్షన్లు తీసుకోబోతుందన్నారు. ఎవరైన ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదు చేయాలనుకుంటే వెంటనే 915417960 వాట్సప్ నంబరును సంప్రదించాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులపై ఆయన గురువారం కోఠి ఆరోగ్యశాఖ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా హెల్త్ డైరెక్టర్ మాట్లాడుతూ..ప్రభుత్వం ఆదేశాలతో వైద్యశాఖ ముందు చూపుతో రాష్ట్రంలో కరోనా కంట్రోలోకి వస్తుందన్నారు. రోజు వారీ కొత్త కేసులు గణనీయంగా తగ్గుతున్నాయన్నారు. మే మొదటి వారంలో పాజిటివ్ రేట్ సగటును 9.50 ఉండగా, రెండో వారంలో 7.22, మూడో వారంలో 6.01 తేలగా, ప్రస్తుతం అది కేవలం 4శాతానికి తగ్గిపోయిందన్నారు. అంతేగాక రికవరీ రేట్ 81శాతం నుంచి 93 శాతానికి పెరిగిందన్నారు. దీంతో పాటు డిశ్చార్జ్‌ల సంఖ్య కూడా భారీగా పెరగుతుందన్నారు. మరిన్ని రోజులు ప్రజలు సహకరిస్తే సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గిపోతుందని డిహెచ్ అన్నారు.
బ్లాక్ ఫంగస్‌పై ప్రత్యేక పర్యవేక్షణ
సిఎం కెసిఆర్ ఆదేశాలతో బ్లాక్ ఫంగస్‌పై వైద్యశాఖ ప్రత్యేక దృష్టి సారించిందని డిహెచ్ వివరించారు. హెల్త్ సెక్రటరీ రిజ్వీ సూచన మేరకు తాను డిఎంఇ డా రమేష్‌రెడ్డి, సిఎం ఓఎస్డీ డా గంగాధర్, కాళోజి వి.సి కరుణాకర్‌రెడ్డిలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకుంటూ మౌళిక వసతులు, మందులు సమకూర్చే పనిలో ఉన్నామన్నారు. ప్రస్తుతానికి 270 మంది పేషెంట్లు 44 ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని, వారంతా బాగానే ఉన్నారని డిహెచ్ పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ప్రభుత్వమే నేరుగా బ్లాక్ పంగస్ మందులు పంపిణీ చేస్తుందన్నారు. ప్రతి పేషెంట్‌కు యాంటీటొరిసిన్ బి నే కాకుండా పోసోనోజోల్, లైఫోజోనల్ వంటి ప్రత్యమ్నాయ మందులను కూడా వినియోగించాలన్నారు. అంతేగాక ముందస్తు చూపుతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1500 బెడ్లను బ్లాక్ ఫంగస్ కొరకు సిద్ధంగా ఉంచామన్నారు. కావున ప్రజలెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని డిహెచ్ స్పష్టం చేశారు.
37 వేల బృందాలతో సర్వే
కరోనా కంట్రోల్‌కి ఫీవర్ సర్వే ఎంతో ఉపయోపడుతుందని డైరెక్టర్ వివరించారు. ఇప్పటి వరకు మొదటి రౌండ్‌లో కోటి లక్షన్నర ఇళ్లకు తిరిగి 2 లక్షల 43వేలకు పైగా లక్షణాలు ఉన్నోళ్లను గుర్తించామని, వారందరికి కిట్లు కూడా పంపిణీ చేశామన్నారు. దీంతో పాటు ప్రస్తుతం రీ సర్వే కూడా కొనసాగుతుందని లక్షణాలు ఉన్నోళ్లందరికీ కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. కానీ వీరంతా వైరస్ బారిన పడినట్లు కాదని, మందస్తు జాగ్రత్తతో మాత్రమే ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. లక్షణాలు ఉన్నోళ్లు నిర్లక్షం వహించకుండా ప్రభుత్వ కేంద్రాలకు వెళ్లి వెంటనే టెస్టులు చేసుకోవాలని ఆయన చెప్పారు.
నేటి నుంచి సూపర్ స్ప్రెడర్లకు టీకా
శుక్రవారం నుంచి స్పెషల్ డ్రైవ్ వ్యాక్సినేషన్ కొనసాగుతుందని డిహెచ్ వివరించారు. జిహెచ్‌ఎంసితో పాటు జిల్లాల్లో ని సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే జిహెచ్‌ఎంసి పరిధిలోని 30 సర్కిళ్లలో 30 స్పెషల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈమేరకు జిహెచ్‌ఎంసికి 2.10 లక్షల డోసులు, జిల్లాలకు 1.45 లక్షల డోసులను పంపించినట్లు చెప్పారు. టోకెన్ల ప్రకారం ఈ వ్యాక్సినేషన్ జరుగుతుందని తేల్చిచెప్పారు. అయితే టోకెన్లు రానివారెవరూ భయపడొద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేందుకు వైద్యశాఖ కృషి చేస్తుందని డిహెచ్ చెప్పారు.
TS Govt gives show cause notice to 64 Private Hospitals