కొవిడ్ వచ్చిన వారు టీకా తీసుకుంటే దీర్ఘకాలం
వారికి బూస్టర్ డోసు కూడా అవసరం ఉండకపోవచ్చు
వ్యాక్సిన్ మాత్రమే వేసుకుంటే యాంటీబాడీలు తాత్కాలికం
తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
వాషింగ్టన్: కరోనా సోకినా, లేదా టీకా తీసుకోవడం వల్ల మనుషుల్లో ఏర్పడే రోగ నిరోధక శక్తి ఎక్కువ కాలం ఉండదేమోనన్న భయం అటు శాస్త్రజ్ఞులు మొదలుకొని ఇటు సామాన్యుడి వరకు ఉంది. అయితే రోగనిరోధక శక్తి కనీసం ఏడాది పాటు, కొంత మందిలో అయితే దశాబ్దాల పాటు అలాగే ఉంటుందని తాజాగా నిర్వహించిన అధ్యయనం వల్ల తెలుస్తోంది. కరోనా సోకిన, టీకా వేయించుకున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. భవిష్యతుల్లో వారు బూస్టర్ డోస్ తీసుకోవలసిన అవసరమే ఉండదనే దీని అర్థం. మొత్తం జీవితానికి ఇదే సరిపోవచ్చు కూడా అని అమెరికా నుంచి వెలువడే ‘టైమ్స్’ పత్రికలో సైన్స్ విభాగం ఇన్‌చార్జి అపూర్వ మందవిల్లి అభిప్రాయపడ్డారు. అయితే కరోనా సోకని, టీకా మాత్రమే తీసుకున్న వారికి మాత్రం మళ్లీ ఏడాది తర్వాత బూస్టర్ డోసు అవసరం కావచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ రెండు అధ్యయనాలు కూడా వైరస్‌తో పోరాటం చేసి తిరిగి యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి చేయాల్సిన అవసరం వచ్చే దాకా ఎముక మూలుగలోనే ఉండిపోయే రోగనిరోధక కణం (ఇమ్యూన్ సెల్) ఆధారంగానే జరిగాయి.‘ అయితే ఎముక మూలుగను తీయడం అనేది సంక్లిష్టమైన ప్రక్రియ. శరీరం నుంచి రక్తం తీయడం లాగా కాదు’ అని అపూర్వ అన్నారు. ‘అయితే మనుషుల శరీరంనుంచి ఎముక మూలుగను ఒకసారి కాదు చాలా సార్లు పొందవచ్చు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం’ అని ఆమె అన్నారు.
మనిషి శరీరంలో ఈ రోగనిరోధక కణాలు రూపొందే కొద్దీ అవి ఉత్పత్తి చేసే యాంటీ బాడీలు కూడా వైరస్‌తో మరింత మెరుగ్గా పోరాడేవిగా తయారవుతుంటాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ‘వాస్తవంగా ఇన్‌ఫెక్షన్ ముగిసిన తర్వాత కూడా ఈ రోగ నిరోధక కణాలు వైరస్‌తో పోరాడడం నేర్చుకుంటూనే ఉంటాయి ఎందుకంటే మనిషి రోగ నిరోధక వ్యవస్థలో కాస్త వైరస్ మిగిలి ఉంటుంది’ అని అపూర్వ అంటున్నారు. రోజులు గడిచే కొద్దీ ఈ రోగ నిరోధక కణాలు వైరస్‌తో బలంగా పోరాడే విధంగా తయారవుతాయి. అవి తమ శక్తి సామర్థాలను మరింత విస్తృతం చేసుకుని పలు రకాల వైరస్‌లపై పోరాడగలిగే విధంగా ఎదుగుతాయని కూడా ఆమె తెలిపారు. అయితే టీకాలు మాత్రం ఇదే ఫలితాలను ఇవ్వక పోవచ్చు. ఎందుకంటే టీకా ఇచ్చిన తర్వాత ఏర్పడే ఇమ్యూన్ మెమరీ భిన్నంగా ఉండవచ్చు. అంతేకాదు వైరస్‌నుంచి కోలుకున్న వారికి కూడా టీకాలు అవసరం కావచ్చు. ఎందుకంటే వైరస్ సోకినప్పుడు కొంత మందిలో బలమైన రోగనిరోధక శక్తి ఏర్పడకపోవచ్చు. అందువల్ల ప్రతిఒక్కరూ వైరస్ సోకినా, సోకకపోయినా టీకా తీసుకుని తీరాలి అని అపూర్వ మందవిల్లి స్పష్టం చేశారు.
Covid 19 vaccines provide life long protection