మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా కరోనా సెకండ్ వేవ్‌తో నిలిచిపోయిన విషయం తెలిసిందే. రామ్‌చరణ్, సోనూసూద్‌లపై షూటింగ్ చేస్తూ ఉండగా సోనూసూద్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అలా నిలిపివేసిన షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా మరి కొన్ని రోజులు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక ఫిల్మ్‌మేకర్స్ హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో తుది షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. జూలైలో 20 రోజుల షెడ్యూల్‌తో ‘ఆచార్య’కు గుమ్మడికాయ కొట్టే అవకాశాలు ఉన్నాయట. తుది షెడ్యూల్‌లో చిరంజీవి, చరణ్, సోనూసూద్‌తో పాటు కీలక నటీనటులు పాల్గొనబోతున్నారు.
ఈ నెలలోనే సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్‌తో మొత్తం ప్లాన్ తలకిందులైంది. జూలైలో సినిమాను ముగించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టులో పరిస్థితులు అనుకూలించినా కూడా సినిమా విడుదలకు సిద్ధం కాదు. కనుక సినిమాను దసరా వరకు విడుదల చేసే అవకాశాలు కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
చిరు, చరణ్‌లు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులతో పాటు అన్ని వర్గాల వారిలో కూడా దీనిపై ఆసక్తి నెలకొంది. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను పెద్ద ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. అపజయం ఎరుగని కొరటాల శివ ఖచ్చితంగా ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్‌కు బిగ్గెస్ట్ సక్సెస్‌ను ఇవ్వబోతున్నాడనే నమ్మకం వ్యక్తమవుతోంది. చిరంజీవి ‘ఆచార్య’ ముగిస్తే మరో మూడు సినిమాలు లైన్‌గా వేచి ఉన్నాయి. ‘ఆచార్య’ షూటింగ్ పూర్తి చేసి విడుదల వరకు ఆగకుండా ‘లూసీఫర్’ రీమేక్‌ను చిరంజీవి మొదలు పెట్టే అవకాశం ఉంది. అలాగే కొరటాల కూడా ఎన్టీఆర్‌తో సినిమా మొదలు పెట్టబోతున్నాడు.