ముంబై: కరోనా వైరస్ దెబ్బకు అర్ధాంతరంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్14కు సంబంధించి మిగిలిన మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించింది. ఈ విషయాన్ని బిసిసిఐ శనివారం అధికారికంగా ధ్రువీకరించింది. కరోనా వల్ల అగి పోయిన మ్యాచ్‌లను యుఎఇలోనే నిర్వహిస్తామని బిసిసిఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. శనివారం బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేతృత్వంలో జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకున్నారు. ఇక ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే ట్వంటీ20 ప్రపంచకప్ నిర్వహణ గురించి కూడా సమావేశంలో చర్చించారు. వరల్డ్‌కప్ నిర్వహణకు సంబంధించిన నిర్ణయం తీసుకునేందుకు మరో నెల రోజుల గడువు కావాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి)కి కోరాలని సమావేశంలో నిర్ణయించారు. అక్టోబర్, నవంబర్ నెలలో భారత్‌లో టి20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉంది. ఇదిలావుండగా కొన్ని రోజులుగా భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో భారత్‌లోనే ఈ వరల్డ్‌కప్ నిర్వహించాలనే ఉద్దేశంతో బిసిసిఐ ఉంది. దీని కోసం మరి కొన్ని రోజులపాటు వేచి చూడాలని బిసిసిఐ భావిస్తోంది. ఇక ఐపిఎల్ సెప్టెంబర్ మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశాలున్నట్టు బోర్డు వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే దీనిపై తుది ప్రకటన చేస్తామని బోర్డు అధ్యక్షుడు గంగూలీ వెల్లడించాడు. ఇక ఫైనల్ మ్యాచ్‌ను అక్టోబర్ 9 లేదా 10న నిర్వహించే అవకాశం ఉంది.
BCCI Announce remaining IPL Matches to be held in UAE