Sunday, September 22, 2024

కొవిడ్ అనాథ బాలలు

- Advertisement -
- Advertisement -

Children orphaned across India by Corona

 

మూడు నాలుగు కోట్ల మంది అనాథ వీధి బాలలున్న చోట వారికి మరి కొన్ని వేల మంది కలిస్తే కొంపలు మునిగేదేముంది, పలక, బలపం పట్టుకోవలసిన వయసులో పని పిల్లలుగా, బాల కార్మికులుగా, మాఫియాల చేతి కీలు బొమ్మలుగా, కూడళ్ల వద్ద అడుక్కు తినేవారుగా బతుకుతున్న బాలలు అసంఖ్యాకంగా గల దేశంలో అటువంటి మరి కొందరు తయారైతే తప్పేముంది అని సంతృప్తి పడే పాలకులున్న చోట కొవిడ్ 19 విష కోరలకు తలిదండ్రులను కోల్పోయిన పసి వారి గురించి శ్రద్ధతో పట్టించుకోవాలని సుప్రీంకోర్టు కొరడా ఝళిపిస్తూ ఆదేశించడం ఎంతైనా సంతోషదాయకం. కేంద్రంలో, రాష్ట్రాల్లో మాతాశిశు సంరక్షణ శాఖలుంటాయి. జిల్లాల్లోనూ సంబంధిత అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ శిశు సంరక్షణాలయాల వ్యవస్థలు నెలకొన్నాయి. చట్టప్రకారం అంతా సవ్యంగానే కనిపిస్తుంది. కాని పుట్టగానే బాల్యాన్ని, ఆత్మగౌరవంతో కూడిన జీవనావకాశాలను కోల్పోతున్న బాలలను పట్టించుకునే నాథులు లేని దుస్థితి ఇప్పటికీ కొనసాగుతున్నది.

ఇటువంటి బాలలు దేశంలో ఎక్కడబడితే అక్కడ కనిపిస్తుంటారు. దేశ రాజధానిలో, ఇతర ప్రధాన నగరాల్లో లక్షలాది మంది వీధి బాలలు దర్శనమిస్తుంటారు. దేశంలోని బాలల రక్షణాలయాల బండారాన్ని 2018లో బీహార్‌లోని ముజఫర్‌పూర్ అనాథ బాలికల ఆశ్రమ దారుణోదంతం బయట పెట్టింది. బ్రజేష్ ఠాకూర్ అనే ఘరానా పెద్ద మనిషి నడుపుతూ వచ్చిన ఆ అనాథాలయంలోని 7-17 సంవత్సరాల వయసు బాలికలు ఆశ్రమ నిర్వాహకుడి సన్నిహితుల లైంగిక దోపిడీకి, హింసకు గురైన విషయం వెల్లడై సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యమున్న దేశంలో తలిదండ్రులిద్దరూ కొవిడ్ 19కి బలైపోగా నా అనేవారు లేకుండా పోయిన పిల్లలెంత మంది ఉన్నారో, వారి స్థితిగతులేమిటో తెలుసుకొని వారిని తక్షణమే ఆదుకోవాలని న్యాయమూర్తులు ఎల్. నాగేశ్వర రావు, అనిరుద్ధ బోసుల సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం నాడు ఆదేశించింది.

ఈ బాలలను ఇంత వరకు పట్టించుకోకపోడం వల్ల విలువైన ఎంతో సమయం వృథా అయిపోతున్నదని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే అంతటా గాలించి ఇటువంటి బాలలను కనుక్కొని వారికి తిండి, దుస్తులు, వసతి వంటి కనీస అవసరాలు కల్పించాలని దేశంలోని అన్ని జిల్లాల అధికారులను ఆజ్ఞాపించింది. తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూడకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. దేశంలో మొదటిసారి కరోనా విజృంభించిన 2020 మార్చి నుంచి దాని వల్ల గాని, ఇతర కారణాలతో గాని తలిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లల తాజా సమాచారం తెలియజేయాలని, వారి విషయంలో ఇంత వరకు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ విజృంభణ తర్వాత ప్రభుత్వ రక్షణ హోంలలోని బాలల సంక్షేమంపై ధర్మాసనం స్వచ్ఛందంగా విచారణ జరిపింది.

విచిత్రమేమిటంటే కొవిడ్ వల్ల తలిదండ్రులను కోల్పోయిన బాలలు ఒక్క మహారాష్ట్రలోనే 2000 మంది వరకు ఉంటారని ధర్మాసనంలోని న్యాయమూర్తి నాగేశ్వర రావు స్వయంగా పేర్కొనగా, ఈ నెల ఏప్రిల్ 1 నుంచి రెండో దశ కరోనా వల్ల దేశ వ్యాప్తంగా అనాథలుగా మారిన బాలల సంఖ్య 577 మాత్రమే అని స్మృతి ఇరానీ ఆధ్వర్యంలోని కేంద్ర స్త్రీ, బాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మొన్న మంగళవారం నాడు ప్రకటించింది. ప్రభుత్వ గణాంకాలకు వాస్తవ స్థితికి ఇంత తేడా ఉన్నదంటే బాధ్యులైన అధికార గణం, సిబ్బంది ఎంత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక సమాచారం ప్రకారం దేశ వ్యాప్తంగా వీధి బాలలు 3 కోట్లకు పైగా ఉండగా, రక్షణాలయాల్లో వారు నాలుగైదు లక్షలకు మించి లేరు. దేశంలో దత్తత సంప్రదాయం అరుదు. కన్న పిల్లల మీద, సమీప బంధువుల సంతానం మీద ఉండే ఆసక్తి బిడ్డలను కనే అవకాశాలు లేనప్పుడు అనా థ బాలలను చేరదీసి ముద్దుగా పెంచుకోడం పై ఉండదు.

దత్తత పేరుతో ముందు కొచ్చే వారిలో ఆ పిల్లలను బాల కార్మికులుగా, కూడళ్లలో యాచించి సంపాదించి తెచ్చే వారుగా ఉపయోగించుకునే వారు, ఎదిగిన తర్వాత వ్యభిచార గృహాలకు అమ్ముకునే దుర్బుద్ధితో ఉన్నవారు కూడా ఉంటారు. అందుచేత దత్తత విషయంలో ప్రభుత్వం తగిన నిబంధనలు రూపొందించవలసి వచ్చింది. ఇంత కారుచీకటిలోనూ కాంతి పుంజాల్లా ఢిల్లీ, కేరళ, తమిళనాడు వంటి పలు రాష్ట్రాల్లో కొవిడ్ అనాథ బాలలకు ఆర్థిక సాయం అందిస్తూ, విద్యా బుద్ధులు నేర్పించే బాధ్యతను కూడా అక్కడి ప్రభుత్వాలు తీసుకున్నాయి. కేంద్రం సైతం తాజా పరిస్థితుల నేపథ్యంలో మెరుగైన జాతీయ విధానాన్ని రూపొందించి దేశంలో కొవిడ్ అనాథ బాలలందరికీ గౌరవప్రదమైన ఆశ్రయం కల్పించాలి. దానితో పాటు మొత్తం వీధి బాలలందరినీ చేరదీసి చదువు సంధ్యలు నేర్పించి దేశానికి ఉపయోగపడే పటిష్ఠమైన జన సంపదగా తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది. అనాథ బాలలపై మనం చూపించే శ్రద్ధ రేపటి బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News