లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా పనివేళల్లో మార్పులు
మధ్యాహ్నం ఒంటి గంట వరకు మెట్రో రైలు సేవలు పొడిగింపు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్ సమయాలను పొడిగించడంతో నేటి నుంచి బ్యాంకుల పనివేళలు మారనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వర కు అన్ని బ్యాంకులు పనిచేస్తాయని ఎస్‌ఎల్‌బిసి స్పష్టం చేసింది. సోమవారం అత్యవసరంగా సమావేశ మైన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ. రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలు, లాక్‌డౌన్ పొడిగింపుపై సమీక్షించింది. బ్యాంకు పనివేళల్లోనూ మార్పు చేయాలని పలువురు కమిటీ సభ్యులు ఎస్‌ఎల్‌బీసికి విజ్ఞప్తి చేశారు. దీంతో వారి వినతులను, సలహాల, సూచననలను పరిగణనలోకి తీసుకున్న ఎస్‌ఎల్‌బిసి బ్యాంకు పనివేళలను మార్పు చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు బ్యాంకులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పనిచేస్తున్నాయి. నేటి నుంచి ఎస్‌ఎల్‌బిసి నిర్ణయం మేరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఖాతాదారులకు సేవలు అందించాలని బ్యాంకర్లు నిర్ణయించారు.
మెట్రో సేవలు పెంపు
నగరంలో ప్రయాణికుల సౌకర్యార్థం లాక్‌డౌన్ సడలింపు సమయంలో నడుపుతున్న మెట్రో రైల్ సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ పరిశీలించారు. సోమవారం ఆయన మెట్రో రైల్‌లు లిమిటెడ్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్ అండ్ టి, ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండి కెబిరెడ్డిలతో కలిసి ఖైరతాబాద్ స్టేషను నుంచి అమీర్‌పేట మెట్రో ఇంటర్ చేంజ్ స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. కొవిడ్ నిబంధనల అమలుకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. మెట్రో రైలు సేవలు, భద్రతా చర్యలు వంటి వాటిపై ప్రయాణికులతో ముచ్చటించారు. మెట్రోలో కల్పించిన సౌకర్యాలు, చేసిన భద్రత ఏర్పాట్లపై అభినందించారు. కార్యాలయాలు, వ్యాపారాలు మూసివేసిన తరువాత సౌకర్యవంతంగా ఇంటికి చేరుకోవడానికి మెట్రో రైలు సమయాన్ని పొడించాలని ప్రయాణికులు కోరారు.
ప్రయాణుకుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, మెట్రో సేవలను మరో గంట, అంతకంటే ఎక్కువ పొడిగించాలని మెట్రో అధికారులకు సూచించారు. ప్రతి దిశలో చివరి రైలు ఇప్పడు ఉదయం 11.45 గంటలకు బయలుదేరుతున్నాయి. మంగళవారం నుంచి ప్రతి కారిడార్‌లో చివరి రైళ్లు మధ్యాహ్నం 1 గంటలకు టెర్మినల్ స్టేషన్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు చివరి స్టేషన్లకు చేరుకుంటాయి. కాగా గతంలో మాదిరిగానే మొదటి రైలు స్టేషన్ నుంచి ఉదయం 7 గంటలకే ప్రారంభమైతుందన్నారు. కొవిడ్ సమయంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, భద్రతా ఏర్పాట్లపై మేనేజింగ్ డైరెక్టర్లు ఇద్దరినీ ప్రధాన కార్యదర్శి అభినందించారు.