ఫతేపూర్(యుపి): కొవిడ్-19తో మరణించినవారిగా అనుమానిస్తున్న మరో ఆరు మృతదేహాలు ఉత్తర్ ప్రదేశ్‌లోని గంగానదిలో లభించాయి. ఆదివారం ఉదయం కొన్ని మృతదేహాలు గంగా నదిలో తేలియాడుతూ కనిపించాయని ఫతేపూర్ సదర్ తహసిల్ సబ్ కలెక్టర్(ఎస్‌డిఎం) ప్రమాద్ ఝా తెలిపారు. దీంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టి కుళ్లిపోయిన దశలో ఉన్న ఆరు మృతదేహాలను వెలికితీసినట్లు ఆయన చెప్పారు. అనంతరం ఈ మృతదేహాలకు కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం భితోర గంగా ఘాట్ వద్ద డాక్టర్లు దహనసంస్కారాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పూర్తిగా కుళ్లిపోవడంతో ఈ మృతదేహాలను గుర్తించడం సాధ్యం కాలేదని, ఇవి చాలా దూర ప్రాంతం నుంచి నదిలో కొట్టుకువచ్చినట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. ఈ నెల మొదట్లో బలియా నరాహి ప్రాంతంలోని ఉజియార్, కుల్హాడి, భరోలి ఘాట్ల వద్ద దాదాపు 52 మృతదేహాలు లభించాయి. అయితే అక్కడ లభించిన మృతదేహాల సంఖ్యపై అధికారులు స్పష్టత నివ్వలేదు.