బీజింగ్: కమ్యూనిస్ట్ చైనా మరోసారి కుటుంబ నియంత్రణ నిబంధనలను సడలించింది. సంతాన పరిమితిని ముగ్గురికి పెంచింది. దీంతో, చైనాలో ఒక్కో మహిళ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చే వీలుంటుంది. ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న చైనాలో ఇటీవల జనాభా తగ్గుముఖం పట్టడంతో ఆ దేశ కమ్యూనిస్ట్ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఒకప్పుడు అధిక జనాభాతో విమర్శలు ఎదుర్కొన్న చైనా మూడు దశాబ్దాలపాటు వన్ చైల్డ్ విధానాన్ని కఠినంగా అమలు చేసింది. దాంతో, ఆ కాలంలో 40 కోట్ల జననాలను అరికట్టినట్టు అంచనా. 1979 నుంచి చైనాలో ఒక జంటకు ఒకే బిడ్డ అన్న నిబంధన విధించారు.
దీనిని ఉల్లంఘించినవారికి భారీ జరిమానాలు విధించడం, ఉద్యోగాల నుంచి తొలగించడం, బలవంతంగా అబార్షన్లు చేయించడంలాంటి కఠిన చర్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు చైనా అందుకు విరుద్ధమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశంలో వృద్ధుల జనాభా పెరిగి పోతుండగా, పని చేసే యువకుల జనాభా తగ్గుతోంది. అది అలాగే కొనసాగితే 2050 వరకల్లా 60 ఏళ్లు పైబడినవారి జనాభా దాదాపు సగానికి చేరుకోనున్నది. అదే జరిగితే ఆర్థిక వ్యవస్థకు వృద్ధులు భారంగా మారుతారని, మరోవైపు పని చేసేవారి సంఖ్య తగ్గడం వల్ల ఉత్పాదకత పడిపోతుందని చైనా ఆర్థికవేత్తలు లెక్కలు వేసినట్టుగా అర్థమవుతోంది.
ఇటీవల వెల్లడించిన జనాభా లెక్కల ప్రకారం చైనా జనాభా 141.20 కోట్లు. వీరిలో 60 ఏళ్లు పైబడినవారి సంఖ్య 26.40 కోట్లు. 2019 ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం చైనా జనాభా 143 కోట్లు కాగా, భారత్ జనాభా 137 కోట్లు. 2027 వరకల్లా భారత్ జనాభా చైనాను అధిగమిస్తుందని అంచనా. చైనాలో 2020లో కోటీ 20 లక్షల నూతన శిశువులు జన్మించారు. 2016తో పోలిస్తే జననాల సంఖ్య తక్కువ. 2016లో కోటీ 80 లక్షల నూతన శిశువులు జన్మించారు. చైనాలో పిల్లలకు జన్మనిచ్చే వయసున్న మహిళల పునరుత్పత్తి రేట్ 1.3కు పడిపోయింది. ఈ నేపథ్యంలోనే చైనా కుటుంబ నియంత్రణ విషయంలో సడలింపులీయడం గమనార్హం.